Ravi Shastri: వన్డేల నుంచి హార్ధిక్ పాండ్యా తప్పుకునే అవకాశం ఉంది: రవిశాస్త్రి
- వచ్చే ఏడాది వరల్డ్ కప్ తర్వాత వన్డేల నుంచి పాండ్యా తప్పుకోవచ్చు
- పాండ్యా టీ20లకే పరిమితమయ్యే అవకాశం ఉంది
- టెస్ట్ క్రికెట్ రోజురోజుకు ఆదరణ కోల్పోతోంది
టీమిండియా కీలక ఆటగాడు, ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాను ఉద్దేశించి మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ఇండియాలో జరగనున్న వన్డే ప్రపంచ కప్ తర్వాత వన్డేల నుంచి హార్ధిక్ పాండ్యా తప్పుకునే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వన్డేలను వదిలేసి, టీ20లకే పరిమితమయ్యే అవకాశం ఉందని అన్నారు.
భవిష్యత్తులో చాలా మంది ఆటగాళ్లు టీ20 ఫార్మాట్ కే ప్రాధాన్యతను ఇస్తారని చెప్పారు. వన్డేలు, టీ20ల కంటే టెస్ట్ క్రికెట్ చాలా ప్రత్యేకమైనదైనప్పటికీ... టెస్ట్ క్రికెట్ రోజురోజుకు ఆదరణ కోల్పోతోందని అన్నారు. ఆటగాళ్లు ఏయే ఫార్మాట్లలో ఆడాలో వారే నిర్ణయించుకుంటున్నారని చెప్పారు. హార్ధిక్ విషయానికి వస్తే ఆయన టీ20 ఆడాలనుకుంటున్నాడని అన్నారు.
మరోవైపు, ఇటీవలే ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్ ఎవరూ ఊహించని విధంగా వన్డేల నుంచి తప్పుకున్నాడు. మూడు ఫార్మాట్లలో ఆడటం కష్టంగా ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పాడు.