Neeraj Chopra: 19 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలకడం సంతోషంగా ఉంది: నీరజ్ చోప్రా

Neeraj Chopra opines on his Silver winning performance at World Athletic Championship

  • వరల్డ్ అథ్లెటిక్స్ పోటీల్లో నీరజ్ చోప్రాకు రజతం
  • జావెలిన్ త్రో అంశంలో రెండోస్థానం
  • 88.13 మీటర్లు విసిరిన చోప్రా
  • 2003లో అంజూ బాబీ జార్జ్ కు కాంస్యం
  • మళ్లీ ఇన్నాళ్లకు వరల్డ్ పోటీల్లో భారత్ కు పతకం

భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో రజతం గెలిచిన సంగతి తెలిసిందే.  2003లో పారిస్ లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ పోటీల్లో అంజూ బాబీ జార్జ్ లాంగ్ జంప్ క్రీడాంశంలో కాంస్యం గెలిచిన తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు భారత్ కు మరో పతకం లభించింది. దీనిపై నీరజ్ చోప్రా స్పందించాడు. వరల్డ్ అథ్లెటిక్స్ పోటీల్లో పతకం కోసం 19 ఏళ్ల భారత్ నిరీక్షణకు ముగింపు పలకడం సంతోషంగా ఉందని వెల్లడించాడు. 

ఇక, తాను రజతంతో సరిపెట్టుకోవడంపై ఈ ఒలింపిక్ చాంపియన్ వివరణ ఇచ్చాడు. ఒలింపిక్స్ తో పోల్చితే వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో పోటీ అత్యంత కఠినంగా ఉంటుందని, పైగా, త్రోయర్లందరూ పూర్తి ఫిట్ నెస్ తో ఫామ్ లో ఉన్నారని వివరించాడు. సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో, ఈ చాంపియన్ షిప్ లో రజతం సాధించడం తనకు సంతృప్తినిచ్చిందని నీరజ్ చోప్రా వెల్లడించాడు. టోక్యో ఒలింపిక్స్ కంటే ఈ వరల్డ్ చాంపియన్ షిప్ లో మెరుగైన ప్రదర్శన కనబర్చానని తెలిపాడు. 

టోక్యో ఒలింపిక్స్ లో 87.58 మీటర్లు విసిరి స్వర్ణం సాధించిన చోప్రా, తాజాగా అమెరికాలోని యూజీన్ లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో 88.13 మీటర్లతో రజతం సాధించాడు. ఒలింపిక్స్ కంటే ఎక్కువదూరమే జావెలిన్ విసిరినప్పటికీ చోప్రాకు రెండోస్థానం లభించిందంటే, వరల్డ్ చాంపియన్ షిప్ లో పోటీ ఎంత తీవ్రంగా ఉంటుందో స్పష్టమవుతోంది. ఈ చాంపియన్ షిప్ లో గ్రెనడాకు చెందిన ఆండర్సన్ పీటర్స్ 90.54 మీటర్లు విసిరి పసిడి చేజిక్కించుకున్నాడు.

  • Loading...

More Telugu News