Rajinikanth: ఆ మూలికలను తింటే వారం రోజులకు సరిపడా శక్తి లభిస్తుంది: రజనీకాంత్
- చెన్నైలో యోగా కార్యక్రమం
- హాజరైన రజనీకాంత్
- హిమాలయాల గురించి వివరణ
- అక్కడ అద్భుతమైన వనమూలికలు ఉంటాయని వెల్లడి
రజనీకాంత్... దక్షిణాదిన భాషలకు అతీతంగా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న సూపర్ స్టార్. ఎంత గొప్ప హీరో అయినప్పటికీ సాధారణ జీవితం గడపడానికే ఇష్టపడతారు. ఆధ్యాత్మిక భావాలున్న రజనీకాంత్ తరచుగా హిమాలయాలకు వెళుతుంటారు. రజనీ తాజాగా చెన్నైలో ఓ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరంగా ప్రసంగించారు.
హిమాలయాలను చాలామంది మామూలు మంచు కొండలు అనుకుంటారని, కానీ అవి అద్భుతమైన వనమూలికలకు నెలవు అని వెల్లడించారు. అక్కడ లభించే కొన్ని మూలికలను తింటే వారం రోజులకు సరిపడా శక్తి లభిస్తుందని తెలిపారు. మానవ జీవితంలో ఆరోగ్యానిదే ప్రముఖ స్థానం అని రజనీకాంత్ స్పష్టం చేశారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే మనవాళ్లు సంతోషంగా ఉంటారని, మనం అనారోగ్యంతో ఉంటే మనకు కావాల్సిన వాళ్లు ఆనందంగా ఉండలేరని వివరించారు.
డబ్బు, పేరు, ప్రతిష్ఠలు తనకు కొత్త కాదని, తాను ఎంతో సంపాదించానని అన్నారు. అవన్నీ అశాశ్వతం అని తాత్విక ధోరణిలో వ్యాఖ్యానించారు. సిద్ధులు, యోగుల్లో ఉండే ప్రశాంతతలో తన వద్ద 10 శాతం ప్రశాంతత కూడా లేదని పేర్కొన్నారు. తన కెరీర్ లో 'బాబా', 'రాఘవేంద్ర' చిత్రాలు ఆత్మసంతృప్తిని మిగిల్చాయని రజనీకాంత్ వెల్లడించారు. ఆ సినిమాల ప్రభావంతో ఇద్దరు అభిమానులు సన్యాసం స్వీకరించారని, తాను మాత్రం నటుడిగానే కొనసాగుతున్నానని అన్నారు.