Ram Nath Kovind: ఇక సెలవు... రాష్ట్రపతి పదవికి వీడ్కోలు పలికిన రామ్ నాథ్ కోవింద్

Ram Nath Kovind bids farewell as President of India

  • 2017లో రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్ నాథ్ కోవింద్
  • నేటితో ముగిసిన పదవీకాలం
  • జాతినుద్దేశించి ప్రసంగం
  • అందరికీ కృతజ్ఞతలు చెప్పిన కోవింద్

భారత రాష్ట్రపతిగా 2017లో బాధ్యతలు చేపట్టిన రామ్ నాథ్ కోవింద్ నేడు తన పదవికి వీడ్కోలు పలికారు. రాష్ట్రపతిగా ఆయన పదవీకాలం నేటితో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఐదేళ్ల కిందట తన పట్ల అపారనమ్మకంతో, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ద్వారా తనను భారత రాష్ట్రపతిగా ఎన్నుకున్నారని వెల్లడించారు. ఇవాళ్టితో తన పదవీకాలం ముగిసిందని, పదవిని వదులుకుంటున్న సమయంలో అందరితోనూ తన ఆలోచనలు పంచుకోవాలని భావిస్తున్నానని కోవింద్ తెలిపారు. 

"తోటి పౌరులకు, ప్రజాప్రతినిధులకు నా కృతజ్ఞతలు. పరిపాలనను సజావుగా నడిపించే పౌరసేవకులు, ప్రతి సామాజిక విభాగాన్ని అభివృద్ధితో క్రియాశీలకంగా మార్చుతున్న మన సామాజిక కార్యకర్తలు, భారతీయ సమాజంలో ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగించే అన్ని వర్గాల బోధకులు, గురువులు... ఇలా అందరూ రాష్ట్రపతిగా నా విధులు నిర్వర్తించడంలో తమ నిరంతర సహకారం అందించారు. సరిగ్గా చెప్పాలంటే సమాజంలోని అన్ని వర్గాల వారి నుంచి నాకు సంపూర్ణ సహకారం, మద్దతు, దీవెనలు అందాయి. 

విధి నిర్వహణలోనూ, పౌర పురస్కారాలు అందించే సమయంలోనూ అనేకమంది అసాధారణమైన వ్యక్తులను కలుసుకునే అవకాశం లభించింది. శ్రద్ధ, అంకితభావంతో సహచర భారతీయుల కోసం మెరుగైన భవిష్యత్ ను సృష్టించేందుకు వారు పాటుపడుతున్నారు. సాయుధ బలగాలు, పారామిలిటరీ బలగాలు, పోలీసుల్లోని వీరజవాన్లను కలిసే అవకాశాలను ఎంతో ప్రత్యేకంగా భావిస్తాను. వారి దేశభక్తి అత్యద్భుతమైనది, స్ఫూర్తిదాయకమైనది. 

అంతేకాదు, నేను విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రవాస భారతీయులతో మాట్లాడినప్పుడు మాతృభూమి పట్ల వారి ప్రేమ, ఆపేక్ష హృదయానికి హత్తుకునేలా అనిపించేవి" అని వివరించారు.

  • Loading...

More Telugu News