Pumpkin: గుమ్మడి గింజలు.. పోషకాల గని!

Why should you add pumpkin seeds to your Diet
  • గుమ్మడి గింజల్లో అత్యధిక స్థాయిలో మెగ్నీషియం, జింక్
  • రోగ నిరోధక వ్యవస్థ బలోపేతానికి, మధుమేహం నియంత్రణకు తోడ్పాటు
  • మానసిక ఒత్తిళ్ల నియంత్రణ, జుట్టు పెరుగుదల కూడా..
  • పురుషుల్లో స్పెర్మ్ నాణ్యత పెంపు.. సంతానోత్పత్తి సమస్యలకు చెక్
మారుతున్న జీవనశైలి పరిస్థితుల్లో శరీరానికి తగినంత పోషకాలు అందడం లేదు. ఫాస్ట్ ఫుడ్ తినే అలవాటు పెరిగిపోవడమే దీనికి కారణం. చాలా వరకు మైదా ఉత్పత్తులు, కొవ్వు, చక్కెరలు ఎక్కువగా ఉండే పదార్థాలు తింటున్నారు. దీనివల్ల జీవన శైలి వ్యాధులు పెరిగిపోతున్నాయి. అందువల్ల మంచి పోషకాలు ఉండే ఆహారంపై దృష్టి పెట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో
గుమ్మడి గింజలు తీసుకోవడం శరీరానికి మేలు చేస్తుందని వివరిస్తున్నారు. గుమ్మడి గింజలను ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల ఆహారానికి రుచి కూడా వస్తుందని అంటున్నారు. 

తగిన స్థాయిలో మెగ్నీషియం
సాధారణంగా ఆహార పదార్థాల్లో మెగ్నీషియం లభించడం తక్కువ. కానీ గుమ్మడి గింజల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయుల నియంత్రణకు తోడ్పడుతుంది. అలాగే గుండె, ఎముకల ఆరోగ్యానికి మెగ్నీషియం తగిన స్థాయిలో అందడం చాలా ముఖ్యం

మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి
గుమ్మడి గింజల్లో ట్రిప్టోఫాన్ అనే కీలకమైన అమైనో ఆమ్లం తగిన స్థాయిలో ఉంటుంది. దానితోపాటు 5-హైడ్రాక్సిట్రిప్టోఫాన్ అనే ట్రిప్టోఫాన్ మెటాబోలైట్ పదార్థం కూడా ఉంటుంది. ఈ రెండూ కూడా మనలో మానసిక ఒత్తిళ్లను తగ్గించేందుకు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు ఇప్పటికే నిర్ధారించారు కూడా.

చక్కెర స్థాయులను తగ్గిస్తుంది
గుమ్మడి గింజల్లోని ఫినోలిక్ యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు గణనీయ స్థాయిలో ఉంటాయి. ట్రైగోనెలిన్, డి-చిరో-ఇనోసిటాల్, నికోటినిక్ యాసిడ్ లుగా పిలిచే ఈ సమ్మేళనాలు శరీరంలో ఇన్సూలిన్ తగిన స్థాయిలో విడుదలవడానికి తోడ్పడతాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి.
  • రక్తంలోని హిమోగ్లోబిన్ లో కీలకమైన ఐరన్ తగిన స్థాయిలో ఉండేందుకు గుమ్మడి గింజలు తోడ్పడుతాయి.

జుట్టు పెరుగుదలకు.. 
గుమ్మడి విత్తనాల్లోని పోషకాలు వెంట్రుకల పెరుగుదలకు తోడ్పడుతాయి. వెంట్రుకలు రాలిపోవడం, బలహీనమవడం వంటి సమస్యలకు కారణమైన 5-రిడక్టేజ్‌ను గుమ్మడి గింజల్లో ఉండే ఫైటోస్టెరాల్స్ అడ్డుకుంటాయని నిపుణులు చెప్తున్నారు.

రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం
గుమ్మడి గింజల్లో ఇతర పోషకాలతోపాటు జింక్ సమృద్ధిగా ఉంటుంది. ఇది అద్భుతమైన రోగ నిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది. ఇదే సమయంలో మెదడు, చర్మంతోపాటు శరీరంలోని ఇతర అవయవాల ఆరోగ్యకర పనితీరుకు కూడా పనికి వస్తుంది. అంతేగాకుండా అధిక జింక్ పురుషులలో స్పెర్మ్ నాణ్యతను పెంచుతుంది. సంతానోత్పత్తిని మెరుగుపర్చడంలో సహాయపడుతుంది.

ఈ చిన్న అలవాటు చేసుకుంటే..
  • ఆహారంలో గుమ్మడి గింజలను తీసుకోవడంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా రోజూ తీసుకునే ఆహారంలో గుమ్మడి గింజలను భాగం చేసుకోవచ్చని అంటున్నారు.
  • పెరుగు, పండ్లు, సలాడ్లు సూప్‌లో కొన్ని గుమ్మడి గింజలను వేసుకోవడం అలవాటుగా చేసుకోవాలని సూచిస్తున్నారు.
  • కుకీలు, బ్రెడ్, తీపి పదార్థాల్లో గుమ్మడి గింజలను అలంకరణగా వాడటం వల్ల అటు అందం, ఇటు ఆరోగ్యం రెండూ సమకూరుతాయని అంటున్నారు. 
Pumpkin
Pumpkin Seeds
Diet
Health
Immunity
Sugar Control

More Telugu News