YS Sharmila: సిగ్గు లేకుండా ఒక స్త్రీపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు: కేటీఆర్ పై మండిపడ్డ షర్మిల
- ఓటీటీలో సినిమాలు సూచించమంటే సెటైరికల్ గా సమాధానం ఇచ్చానన్న షర్మిల
- దీంతో తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేశారని వ్యాఖ్య
- వరదలతో ప్రజలు అల్లాడుతుంటే ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తారా? అని నిలదీత
- వరదలకు కాళేశ్వరం ప్రాజెక్టే కారణమన్న షర్మిల
- 33 మంది సిబ్బంది ఉండాల్సిన కడెం ప్రాజెక్టు వద్ద ముగ్గురు మాత్రమే ఉన్నారని విమర్శ
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల విరుచుకుపడ్డారు. కాలుకు దెబ్బ తగలడంతో కేటీఆర్ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కాలక్షేపం కోసం తనకు ఓటీటీలో మంచి సినిమాలు, కార్యక్రమాలను సూచించాలని ఆయన అడిగారు. ఈ నేపథ్యంలో ఆయనకు షర్మిల సెటైరికల్ గా రీట్వీట్ చేశారు. 'మీ ఆనందం కోసం చూడటానికి షోలు: కుట్ర సిద్ధాంతం - క్లౌడ్ బరస్ట్ - నీట మునిగిన గృహాలు మరియు పంప్ హౌస్ లు' అంటూ సమాధానం ఇచ్చారు.
దమ్ముంటే సబ్జెక్ట్ గురించి మాట్లాడాలని షర్మిల అన్నారు. ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తారా? రిమోట్ గా పని చేయడం చేతకాదా? అని ప్రశ్నించారు. కరోనా సమయంలో అందరం రిమోట్ గా పని చేయలేదా? అని అడిగారు. వరదలతో ప్రజలు అల్లాడుతుంటే ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తారా? అని ప్రశ్నించారు.
వరద బాధితులకు ఒక్క రూపాయి కూడా సాయం చేయకుండా సినిమాలు చూస్తారంట అని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు. సిగ్గు లేకుండా ఒక స్త్రీపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యలతో తనకు మండిందని చెప్పారు.