Vishnu Vardhan Reddy: వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి
- ప్లానింగ్ లేకుండా స్కూళ్లను మూసేస్తున్నారన్న విష్ణు
- ఒకే గదిలో మూడు తరగతుల పిల్లలకు పాఠాలు చెప్పడం ఏమిటి? అంటూ ప్రశ్న
- ఈ విషయాలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై కేసులు పెడుతున్నారని విమర్శ
ఏపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు విద్యార్థుల పాలిట శాపంగా మారాయని చెప్పారు. ఎలాంటి ప్లానింగ్ లేకుండా పాఠశాలలను మూసేస్తున్నారని మండిపడ్డారు. మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి పిల్లలు చదువుకుంటారా? అని ప్రశ్నించారు. ఒకే గదిలో మూడు తరగతుల పిల్లలకు పాఠాలు చెప్పడం ఏమిటని విమర్శించారు.
ఈ విషయాలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. జర్నలిస్టులపై కేసులు పెట్టడం దిక్కుమాలిన చర్య అని అన్నారు. మీడియా ప్రతినిధులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశమంతా జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అమలవుతుంటే... ఏపీలో మాత్రం జగన్ విద్యా విధానం అమలవుతోందని ఎద్దేవా చేశారు. జగన్ రివర్స్ పాలనకు ఇదొక ఉదాహరణ అని చెప్పారు.