Venkaiah Naidu: ఉపరాష్ట్రపతిని కలిసిన ఇళయరాజా!
- రాజ్యసభ సభ్యుడిగా పదవీ ప్రమాణం చేసిన ఇళయరాజా
- ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన వెంకయ్య
- ప్రమాణ స్వీకారం తర్వాత ఉపరాష్ట్రపతి నివాసానికి వెళ్లిన ఇళయరాజా
ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుకు తెలుగు నేల అన్నా... దక్షిణాది రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలన్నా ఎనలేని అభిమానం. తన సొంత జిల్లా నెల్లూరుకు కూత వేటు దూరంలో ఉన్న తమిళనాడు, ఆ రాష్ట్ర రాజధాని చెన్నైతో ఆయనది విడదీయలేని బంధం. తమిళనాడుకు సంబంధించి ఏ ముఖ్య కార్యక్రమం జరిగినా వెంకయ్య హాజరు కావాల్సిందే.
అలాంటిది ఆ రాష్ట్రానికి చెందిన సంగీత దర్శక దిగ్గజం ఇళయరాజా రాజ్యసభ సభ్యుడిగా పదవీ ప్రమాణం చేస్తున్న సమయంలో రాజ్యసభ చైర్మన్గా ఉన్న వెంకయ్య అనివార్య కారణాలతో హాజరు కాలేకపోయారు. ఫలితంగా ఇళయరాజాతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రమాణం చేయించారు.
ఈ క్రమంలో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేసిన తర్వాత ఇళయరాజా నేరుగా ఉపరాష్ట్రపతి భవన్కు వెళ్లి వెంకయ్యను కలిశారు. తన అధికారిక నివాసానికి వచ్చిన ఇళయరాజాకు వెంకయ్య సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఇద్దరు ప్రముఖులు పలు అంశాలపై చర్చించుకున్నారు.