Andhra Pradesh: ఖజానాకు ఆదాయం తగ్గకుండా చూడండి.. అధికారులకు ఏపీ సీఎం జగన్ ఆదేశం
- రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే శాఖలపై సమీక్షించిన జగన్
- పన్ను ఎగవేతలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశం
- ఎప్పటికప్పుడు రాబడి ఉండేలా చూడాలని సూచన
- ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిరోధానికి గట్టి చర్యలు చేపట్టాలన్న సీఎం
ఏపీ ప్రభుత్వ ఖజానాకు ఎప్పటికప్పుడు ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని.. రాబడి తగ్గకుండా చూడాలని అధికారులను ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. పన్ను ఎగవేతలకు ఎలాంటి అవకాశం లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. ఏపీకి ఆదాయం సమకూరుస్తున్న రెవెన్యూ, ఎక్సైజ్, మున్సిపల్, గనులు, అటవీ, పర్యావరణ శాఖల అధికారులతో సీఎం జగన్ సమీక్షించి పలు ఆదేశాలు జారీ చేశారు. పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదులు, అభ్యంతరాలను పరిష్కరిస్తూ.. ఆదాయం ఎప్పటికప్పుడు ఖజానాకు సమకూరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో న్యాయపరమైన వివాదాలేమీ తలెత్తకుండా చూసుకోవాలని, ఆదాయం ఆగిపోకూడదని స్పష్టం చేశారు.
అక్రమ మద్యాన్ని నిరోధించాలి..
రాష్ట్రంలో అక్రమ మద్యాన్ని నిరోధించే దిశగా గట్టి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో గ్రామ స్థాయిలో మహిళా పోలీసులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నివారణకు చర్యలు తీసుకోవాలని.. ఏసీబీ ఫిర్యాదుల నంబర్ స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా ఎర్ర చందనం వేలం టెండర్లకు సంబంధించి త్వరలోనే కేంద్ర ప్రభుత్వ అనుమతులు వచ్చే అవకాశం ఉందని ఈ సందర్భంగా అధికారులు సీఎం జగన్ కు వివరించారు. ఈ నేపథ్యంలో ఎర్ర చందనం దుంగలను జాగ్రత్తగా భద్రపర్చే చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.