Indian Boxer: బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ సంచలన వ్యాఖ్యలు.. తన కోచ్‌లను అధికారులు వేధిస్తున్నారని ఆరోపణ

Boxer Lovlina Borgohain says mentally harassed

  • మానసికంగా తీవ్ర వేధింపులు ఎదుర్కొంటున్నానన్న ఒలింపియన్
  • తన కోచ్‌లను క్రీడా గ్రామం బయటే నిలిపివేశారని ఆవేదన
  • శిక్షణకు తీవ్ర ఆటంకం కలుగుతోందన్న లవ్లీనా 
  • రాజకీయాలను ఛేదించి పతకం తీసుకొస్తానని ఆశాభావం

మరో రెండు రోజుల్లో కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం కానున్న వేళ భారత మహిళా బాక్సర్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ సంచలన ఆరోపణలు చేసింది. అధికారులు తన కోచ్‌లను వేధిస్తున్నారని, ఫలితంగా తాను తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నట్టు పేర్కొంటూ ట్విట్టర్‌లో పెద్ద పోస్టు షేర్ చేసింది. ఒలింపిక్స్‌ పతకం గెలవడంలో కీలక పాత్ర పోషించిన తన కోచ్‌లను ప్రతిసారి పక్కనపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో కామన్వెల్త్ గేమ్స్‌కు ముందు తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నట్టు వాపోయింది. తనకు ఎదురైన వేధింపుల గురించి చెప్పాలనే ట్వీట్ చేసినట్టు తెలిపింది.

తన కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత అయిన సంధ్య గురుంగ్‌ను కూడా కామన్వెల్త్ క్రీడా గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారని ఆ పోస్టులో లవ్లీనా పేర్కొంది. వేలాదిసార్లు అభ్యర్థించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఫలితంగా తన శిక్షణకు ఆటంకం కలుగుతోందని పేర్కొంది. ఇది తనను మానసిక వేధింపులకు గురిచేస్తోందని తెలిపింది. 

చాలాసార్లు అభ్యర్థించినా తన ఇతర కోచ్‌లను కూడా భారత్‌కు పంపేశారని ఆరోపించింది. ఇప్పుడు ఆటపై దృష్టి ఎలా పెట్టాలో అర్థం కావడం లేదని, గత ప్రపంచ చాంపియన్‌షిప్‌ల సమయంలోనూ తనకు ఇలాంటి అనుభవమే ఎదురై, తన ప్రదర్శనపై ప్రభావం చూపించాయని పేర్కొంది. అయితే, ఈ రాజకీయాలు కామన్వెల్త్ క్రీడల ప్రదర్శనను నాశనం చేయకూడదని కోరుకుంటున్నానని, ఈ రాజకీయాలను ఛేదించి దేశానికి పతకం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News