Genetic testing: ఏ వ్యాధి వస్తుందో జీన్స్ చూసి చెప్పేయవచ్చు!

Know your future health risk through Genetic testing
  • వారసత్వంగా కొన్ని సమస్యలు రావచ్చు
  • జన్యువుల్లో వచ్చే మార్పులతో కొన్ని రకాల వ్యాధులు
  • ముందే తెలుసుకోవడం వల్ల నివారణకు అవకాశం
ఒకరి జన్యువులను పరీక్షించడం ద్వారా భవిష్యత్తులో వారికి ఎటువంటి వ్యాధులు, ఆరోగ్య సమస్యలు వస్తాయో ముందుగానే చెప్పేయవచ్చని నిపుణులు అంటున్నారు. దీన్నే జెనెటిక్ టెస్టింగ్ గా చెబుతారు. ముందుగా తెలియడం వల్ల ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధగా ఉండడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవడానికి అవకాశం లభిస్తుంది. 

కుటుంబంలో ఎవరికైనా ఏదైనా వ్యాధి ఉంటే, అది వారసులకు వస్తుందా? అన్నది ఈ పరీక్షలో తెలుస్తుంది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జన్యు వైవిధ్యాల వల్ల ఏ వ్యాధి వస్తుందన్నది తెలుసుకోవచ్చు. జన్యువుల్లో పోలిక ఉన్నంత మాత్రాన వ్యాధి రావాలనేమీ లేదు. జీవనశైలి, చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా వ్యాధులను నిర్ణయించొచ్చు. జన్యువుల పరీక్ష ద్వారా కొన్ని సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

మధుమేహం
కుటుంబ చరిత్రలో మధుమేహం ఉంటే వారసులకు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లే. మధుమేహం రావడం వెనుక ఎన్నో జన్యువులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సీఏపీఎన్10, టీసీఎఫ్7ఎల్2, ఏబీసీసీ8, సీసీజీఆర్ అనే జన్యువులకు మధుమేహంతో సంబంధం ఉంటుంది. అయితే, తీసుకునే ఆహారం, శారీరక వ్యాయామాలు అన్నవి మధుమేహం రాకుండా చూసుకోవడానికి సాయపడతాయి.

స్థూలకాయం
ఆహారం తీసుకోవాలని చెప్పి సంకేతాలు ఇవ్వడం వెనుక జన్యువుల పాత్ర ఉంటుంది. ఈ జీన్స్ లో వచ్చే మార్పులే ఒకరు ఎంత చురుగ్గా ఉంటారన్నది నిర్ణయిస్తాయి. తల్లిదండ్రులకు స్థూల కాయం ఉంటే, పిల్లలకూ రావచ్చు. ఎఫ్ టీవో, ఎల్ఈపీ, ఎల్ఈపీఆర్, ఎంసీఆర్ 4 ఇవన్నీ బరువుకు సంబంధించినవి. ఈ జన్యువుల్లో వచ్చే కొన్ని మార్పులతో ఉన్నట్టుండి లావుగా ఒళ్లు పెరిగిపోవచ్చు. జీవనశైలిలో మార్పుల ద్వారా ఈ రిస్క్ ను అధిగమించాల్సి ఉంటుంది. 

రక్తపోటు
జన్యువులు గుండె జబ్బులు, రక్తపోటును ప్రభావితం చేస్తుంటాయి. కుటుంబంలో ఎవరికైనా అధిక రక్తపోటు ఉంటే అది వారి వారసులకు కూడా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. జీన్స్ కు, జీవనశైలి అలవాట్లు కూడా తోడైతే (అంటే పొగతాగడం, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటివి) రిస్క్ పెరిగినట్టుగా అర్థం చేసుకోవాలి.

బ్రెస్ట్, ఒవేరియన్ కేన్సర్
బ్రెస్ట్ కేన్సర్ కేసుల్లో ఎక్కువ వాటికి కుటుంబ నేపథ్యం ఉండడం లేదు. రొమ్ము కేన్సర్ రావడానికి జన్యువుల పాత్ర 5-10 శాతంగానే ఉంటోంది. అలాగే, ఒవేరియన్ కేన్సర్ వారసత్వంగా వచ్చే అవకాశాలు పెరిగాయి. జన్యుపరమైన రుగ్మతల్లో ఎక్కువ శాతం వాటిని నయం చేయలేం. కానీ, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా అధిగమించొచ్చని.. ముందుగా తెలుసుకోవడం వల్ల నివారణ చర్యలకు అవకాశం లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Genetic testing
health risk
preventive

More Telugu News