Rahul Gandhi: ఢిల్లీలో కాంగ్రెస్ నిరసనలు... రాహుల్ గాంధీ అరెస్ట్
- ధరల పెరుగుదల, జీఎస్టీపై కాంగ్రెస్ నిరసనలు
- ఢిల్లీలో రాజ్ పథ్ వద్ద రోడ్డుపై బైఠాయించిన రాహుల్
- పోలీసులకు, కాంగ్రెస్ అగ్రనేతకు మధ్య వాగ్వివాదం
- ఎత్తుకెళ్లి వ్యాన్ ఎక్కించిన పోలీసులు
ఓవైపు తమ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ ప్రశ్నిస్తున్న సమయంలో, కాంగ్రెస్ శ్రేణులు ధరల పెరుగుదల, జీఎస్టీపై ఢిల్లీలో నిరసనలు చేపట్టాయి. ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. ఢిల్లీలోని రాజ్ పథ్ వద్ద ఆయన రోడ్డుపై బైఠాయించగా, పోలీసులు చుట్టుముట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు రాహుల్ గాంధీని అరెస్ట్ చేశారు. ఆయనను మోసుకెళ్లి పోలీస్ వ్యాన్ ఎక్కించారు.
అంతకముందే ఇతర కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో కాంగ్రెస్ శ్రేణులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించాయి. తన అరెస్ట్ పట్ల రాహుల్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల, నిరుద్యోగంపై ప్రజల తరఫున గళం వినిపిస్తున్నానని అన్నారు. మోదీ ఓ రాజులా వ్యవహరిస్తున్నారని, దేశంలో పోలీసు రాజ్యం నడుస్తోందని విమర్శించారు.
కాగా, దీనిపై కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో స్పందించింది. గతంలో ఇందిరాగాంధీ ఇలాగే రోడ్డుపై బైఠాయించిన ఫొటోను, ప్రస్తుతం రాహుల్ రోడ్డుపై బైఠాయించిన ఫొటోను పక్కపక్కనే పెట్టి... 'చరిత్ర పునరావృతం' అంటూ క్యాప్షన్ పెట్టింది.