Pawan Kalyan: భారత సైనికుల ధైర్యసాహసాలు, వీరోచిత పోరాటాలు చూసి ప్రపంచం అచ్చెరువొందిన రోజు ఇది: పవన్ కల్యాణ్
- నాడు కార్గిల్ లో పాక్ దురాక్రమణ
- తిప్పికొట్టిన భారత సైన్యం
- జులై 26న కార్గిల్ విజయ్ దివస్
- స్పందించిన పవన్ కల్యాణ్
భారత వీరజవాన్లు పాకిస్థాన్ సైన్యాన్ని కార్గిల్ కొండలపై విజయవంతంగా తరిమికొట్టిన సందర్భంగా ప్రతి ఏడాది జులై 26న కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. భారత సైనికవీరుల త్యాగఫలమే కార్గిల్ విజయ్ దివస్ అని పేర్కొన్నారు.
1999 జులై 26న భారత సైనికులు శత్రుమూకలను తరిమికొట్టి కార్గిల్ కొండలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన చారిత్రాత్మక శుభదినం అని అభివర్ణించారు. భారత సైనికుల ధైర్యసాహసాలు, వీరోచిత పోరాటాలు చూసి ప్రపంచం అచ్చెరువొందిన రోజు అని పవన్ కల్యాణ్ వివరించారు.
అయితే, ఈ విజయసాధనలో 527 మంది సైనికులు వీరమరణం పొందడం గుండెలను పిండేసే వాస్తవం అని విచారం వ్యక్తం చేశారు. ఈ పోరాటంలో ప్రాణాలు అర్పించిన భారత సైనికులకు శిరసు వంచి వందనం చేస్తున్నానని, వారి ధీరత్వానికి జోహార్లు అర్పిస్తున్నానని తెలిపారు.
భారత సైనిక పాటవాన్ని తక్కువ అంచనా వేసిన పాకిస్థాన్ సరిహద్దులు దాటిందని, తన పారామిలిటరీ బలగాలను వేర్పాటువాదుల రూపంలో కార్గిల్ ప్రాంతానికి పంపి సుమారు 200 కిమీ విస్తీర్ణంలోని భూభాగాన్ని ఆక్రమించుకుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
నాడు శత్రువులను తరిమివేయడానికి భారత సైనికులు చూపిన తెగువ, పోరాటం గురించి ప్రతి ఒక్కరం తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతికూల పరిస్థితులు, ప్రతికూల వాతావరణంలో శత్రువుకు ఎదురెళితే ప్రాణాపాయం తప్పదని తెలిసినా, దేశం కోసం, కోట్లాది మంది ప్రజల కోసం శత్రుమూకలతో పోరాడి మన దేశ భూభాగాన్ని రక్షించిన వారి త్యాగం ఎంత కీర్తించినా తక్కువేనని తెలిపారు.
ఈ విజయభేరిలో నినదించిన ప్రతి సైనికుడికి, వారి కుటుంబాలకు భరత జాతి సర్వదా రుణపడి ఉంటుందని పవన్ వెల్లడించారు. అమరుల త్యాగాలను ఈ దేశం ఎప్పుడూ స్మరించుకుంటూనే ఉంటుందని ఉద్ఘాటించారు.