Twitter: మేఘాలు వచ్చి మింగేస్తున్నట్టు.. అద్భుతమైన వీడియోను షేర్ చేసిన నాగాలాండ్ మంత్రి!
- కొండ ప్రాంతం నుంచి మెల్లగా వచ్చి పట్టణాన్ని కమ్మేసిన మేఘాలు
- ఉదయం, సాయంత్రం రెండు సార్లూ కనువిందు చేసిన దృశ్యం
- ట్వీట్టర్ లో ఒక్కరోజే 2.2 లక్షలకుపైగా వ్యూస్.. వేల మంది రీట్వీట్ లు
అందమైన లోయ.. పక్కనే ఉన్న కొండ ప్రాంతం నుంచి మెల్లగా మేఘాలు రావడం మొదలైంది. వచ్చిన మేఘాలు వచ్చినట్టే కిందికి దిగుతూ.. అక్కడున్న పట్టణాన్ని కమ్మేస్తూ.. మళ్లీ వెనక్కి వెళుతూ.. తిరిగి కమ్మేస్తూ అలరించాయి. నాగాలాండ్ లోని ఓ కొండ ప్రాంతంలో ఉదయం ఓసారి.. సాయంత్రం మరోసారి ఈ అందమైన దృశ్యం కనువిందు చేసింది. నాగాలాండ్ రాష్ట్ర మంత్రి తంజెన్ ఇమ్నా అలాంగ్ దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు.
అద్భుతంగా ఉందంటూ..
ఈ వీడియోలో కొండలపై నుంచి వచ్చిన మేఘాలు కొంత సేపట్లోనే దిగువకు జారుతూ పట్టణం, లోయ ప్రాంతం మొత్తాన్ని కమ్మేశాయి. మళ్లీ వాతావరణం మారినకొద్దీ మేఘాలు కదిలిపోయాయి. నాగాలాండ్ మంత్రి సోమవారం ఈ వీడియోను షేర్ చేయగా.. ఒక్క రోజులోనే 2.2 లక్షల మంది చూశారు. 11 వేలకుపైగా లైకులు వచ్చాయి. వేల మంది రీట్వీట్ చేశారు. ఈ దృశ్యం ఎంతో అద్భుతంగా ఉందని వేలాది మంది కామెంట్ చేశారు. ఈ దృశ్యం నాగాలాండ్ లోని కోహిమా సమీపంలోనిదని మరికొందరు తమ కామెంట్లలో పేర్కొన్నారు.