Telangana: స్తంభించిన కేటీఆర్ వాట్సాప్... 24 గంటలుగా తెరచుకోని వైనం
- సోమవారం నుంచి స్తంభించిన కేటీఆర్ వాట్సాప్
- మూడు సార్లు ఓపెన్ అయి మళ్లీ స్తంభించిన వైనం
- 8 వేల మెసేజ్‌లు పోటెత్తడమే కారణమన్న కేటీఆర్
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి నేతకు చెందిన వాట్సాప్ గడచిన 24 గంటలుగా స్తంభించిపోయిందట. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా స్వయంగా కేటీఆరే వెల్లడించారు. దాదాపుగా 8 వేలకు పైగా సందేశాలు వచ్చిన నేపథ్యంలోనే తన వాట్సాప్ స్తంభించిపోయిందని ఆయన తెలిపారు.
అయితే తన వాట్సాప్‌ను ఓపెన్ చేసేందుకు కేటీఆర్ విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో సోమవారం నుంచి మూడు పర్యాయాలు తెరచుకున్న వాట్సాప్ ఆ వెంటనే తిరిగి స్తంభించిపోతోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా 24 గంటలుగా తన వాట్సాప్‌ను ఓపెన్ చేయలేకపోతున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన వాట్సాప్‌ను స్తంభించినట్లు కనిపిస్తున్న సందేశాన్ని ఆయన తన ట్వీట్‌కు జత చేశారు. డిజిటల్ ఛాలెంజెన్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ఆయన తన ట్వీట్‌కు జోడించారు.