Hyderabad: హైదరాబాద్ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురికి బెయిల్
- మే 28న జూబ్లీహిల్స్ లో గ్యాంగ్ రేప్ ఘటన
- 17 ఏళ్ల అమ్మాయిని కారులో ఎక్కించుకుని సామూహిక అత్యాచారం
- ఎమ్మెల్యే కుమారుడికి బెయిల్ నిరాకరణ
ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన హైదరాబాద్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులైన నలుగురు మైనర్లకు బెయిల్ లభించింది. అమ్నేషియా పబ్ నుంచి బయటకు వచ్చిన ఒక మైనర్ బాలికపై వీరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మే 28న జూబ్లీహిల్స్ లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
17 ఏళ్ల అమ్మాయిపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒక ప్రజాప్రతినిధి కుమారుడు కూడా ఉన్నాడు. ఒక్కొక్కరికి రూ. 5 వేల పూచీకత్తుతో పాటు పోలీసులు విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలనే షరతుపై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎమ్మెల్యే కుమారుడికి జువైనల్ బోర్డు బెయిల్ నిరాకరించింది. నిందితుల్లో ఏకైక మేజర్ అయిన సాదుద్దీన్ మాలిక్ కు కోర్టు బెయిల్ నిరాకరించడంతో అతను చంచల్ గూడ జైల్లోనే ఉన్నాడు.
ఈ కేసులో రాజకీయ నేతల పిల్లలు ఉండటంతో పోలీసులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కీలక ఆధారాలను సేకరించారు. దాదాపు 400 పేజీల ఛార్జ్ షీట్ ను సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ కేసులో ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నివేదిక, సీసీ కెమెరా ఫుటేజీలు, మొబైల్ డేటా కీలకం కానున్నాయి.