Indian Railways: రైళ్లలో వృద్ధులకు త్వరలో రాయితీ పునరుద్ధరణ... కొత్త షరతులు ఇవే
- కరోనా నేపథ్యంలో రైళ్లలో వృద్ధులకు నిలిచిన రాయితీ
- త్వరలో పునరుద్ధరించనున్నట్లు ప్రకటించిన కేంద్రం
- వయో పరిమితి 58 నుంచి 70 ఏళ్లకు పెంపు
- జనరల్, స్లీపర్ క్లాసులకు మాత్రమే పరిమితం కానున్న రాయితీ
వయో వృద్ధులకు అందజేస్తున్న రాయితీలను పునరుద్ధరించే దిశగా భారతీయ రైల్వే కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు బుధవారం పార్లమెంటు సమావేశాల్లో భాగంగా రైళ్లలో వృద్ధులకు అందిస్తున్న రాయితీలను పునరుద్ధరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే గతంలో అమలు చేసిన రాయితీలకు కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలిపింది.
కరోనా నేపథ్యంలో గత కొన్ని నెలలుగా రైళ్లలో ప్రయాణించే వృద్ధులకు రాయితీలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా పునరుద్ధరించనున్న రాయితీ 70 ఏళ్ల వయసు నిండిన వృద్ధులకు మాత్రమే అందనుంది. గతంలో ఈ వయో పరిమితి 58 ఏళ్లుగా ఉండేది. అంతేకాకుండా త్వరలోనే అందుబాటులోకి రానున్న రాయితీ ప్రయాణం జనరల్, స్లీపర్ క్లాసుల్లో మాత్రమే వర్తించనుంది.