YSRCP: కేంద్ర అటవీ శాఖ మంత్రితో అంబటి రాంబాబు భేటీ... పల్నాడు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని వినతి
- షెకావత్‌తో భేటీ కోసం ఢిల్లీ వెళ్లిన అంబటి
- కేంద్ర మంత్రి భూపిందర్ యాదవ్‌తోనూ భేటీ
- వరికెపూడిశెల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులివ్వాలని వినతి
ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు విషయంపై కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ కోసం బుధవారం ఢిల్లీ వెళ్లిన ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు.. ఆ భేటీ అనంతరం మరో కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. వైసీపీ ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలులను వెంటబెట్టుకుని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపిందర్ యాదవ్‌ను అంబటి రాంబాబు కలిశారు.
ఈ సందర్భంగా తన సొంత జిల్లా పల్నాడు జిల్లాలోని వరికెపూడిశెల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని రాంబాబు కోరారు. పల్నాడు ప్రాంతంలో ఈ ప్రాజెక్టుకు ఎంతో ప్రాధాన్యం ఉందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి రాంబాబు విన్నవించారు.