Bhiknoor: భిక్కనూరు సిద్ధరామేశ్వరాలయంలో 204 ఏళ్లనాటి రెండు అణాల రాగినాణెం.. వెనక సీతారాముల బొమ్మ!
- భిక్కనూరు సిద్ధరామేశ్వరాలయ హుండీలో లభించిన నాణెం
- 1818లో యూకేలో ముద్రించిన ఈస్టిండియా కంపెనీ
- ముందువైపు ఓం, వెనకవైపు ఆంజనేయ సమేత సీతారాములు
- వేలం వేస్తే భారీ ధర పలికే అవకాశం
తెలంగాణలోని ఓ ఆలయ హుండీలో 204 సంవత్సరాల నాటి పురాతన రాగి నాణెం లభించింది. ఎవరో భక్తుడు దీనిని హుండీలో వేసి ఉంటాడని భావిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భిక్కనూరు సిద్ధరామేశ్వరాలయం హుండీలో ఈ నాణెం లభించింది. రెండు అణాల విలువైన ఈ నాణేన్ని 1818లో ముద్రించారు.
నాణెం ముందువైపు ఈస్టిండియా కంపెనీ అని ఇంగ్లిష్‌లో రాసి ఉంది. మధ్యభాగంలో పైన అటుఇటు వెలుగుతున్న జ్యోతుల మధ్య ‘ఓం’ రాసి ఉంది. దానికింద కమలం పువ్వు, దానికి అటుఇటు ‘యూకే’ అని రాసి వుంది. రెండు అణాలు అని రాసి ఉన్న దీని కింద భాగంలో 1818 అని తయారైన సంవత్సరాన్ని ముద్రించారు. వెనకవైపు ఆంజనేయ సమేత సీతారాముల బొమ్మను ముద్రించారు. వేలం వేస్తే ఈ నాణేనికి భారీ ధర పలికే అవకాశం ఉందని చెబుతున్నారు.