Jairam Ramesh: స్మృతి ఇరానీ సభ్యత లేకుండా ప్రవర్తించారు: జైరాం రమేశ్
- పార్లమెంటును కుదిపేస్తున్న 'రాష్ట్రపత్ని' వివాదం
- సోనియా క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
- స్మృతి ఇరానీని లోక్ సభ స్పీకర్ ఎందుకు నిలువరించలేదన్న జైరాం రమేశ్
ద్రౌపది ముర్మును 'రాష్ట్రపత్ని' అంటూ కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌధురి చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశం పార్లమెంటును సైతం కుదిపేస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. లోక్ సభ వాయిదాపడిన సమయంలో తను బయటకు వెళ్లబోతూ.. బీజేపీ ఎంపీ రమాదేవి వద్దకు నడుచుకుంటూ వెళ్లిన సోనియా గాంధీ... 'అధిర్ రంజన్ చౌధురి ఇప్పటికే క్షమాపణ చెప్పారు. ఈ వ్యవహారంలోకి నన్నెందుకు లాగుతున్నారు' అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కల్పించుకుని 'మేడమ్, నాతో మాట్లాడండి. మీ పేరును ప్రస్తావించింది నేనే' అన్నారు. దీంతో... 'నాతో మాట్లాడకు (డోంట్ టాక్ టు మీ)' అంటూ సోనియా ఘాటుగా స్పందించినట్టు తెలుస్తోంది.
మరోవైపు స్మృతి ఇరానీపై కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ విమర్శలు గుప్పించారు. ఈ రోజు లోక్ సభలో స్మృతి ఇరానీ సభ్యత లేకుండా వ్యవహరించారని అన్నారు. ఆమెను లోక్ సభ స్పీకర్ ఎందుకు నిలువరించలేదని ప్రశ్నించారు. రూల్స్ కేవలం ప్రతిపక్షానికి మాత్రమే వర్తిసాయా? అని విమర్శించారు.