India: కామన్వెల్త్ క్రీడల వేదిక బర్మింగ్ హామ్ లో భారత త్రివర్ణ పతాకావిష్కరణ
- నేటి నుంచి బ్రిటన్ లో కామన్వెల్త్ క్రీడలు
- క్రీడాగ్రామంలో మువ్వన్నెల జెండా రెపరెపలు
- హాజరైన భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు, అధికారులు
బ్రిటన్ లో నేడు కామన్వెల్త్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా, కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమిస్తున్న బర్మింగ్ హామ్ లోని క్రీడాగ్రామంలో భారత అథ్లెట్ల బృందం త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించింది. భారత పురుషుల, మహిళల హాకీ జట్ల సభ్యుల సహా అనేకమంది అథ్లెట్లు, భారత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు అనిల్ ఖన్నా, కోశాధికారి ఆనందేశ్వర్ పాండే, కామన్వెల్త్ క్రీడల్లో భారత చెఫ్ డి మిషన్ రాజేశ్ భండారి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాగ్రామంలో భారత అభిమానులు పాటలకు డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు.
బర్మింగ్ హామ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు జరగనున్నాయి. ఈ క్రీడల్లో 215 మంది భారత అథ్లెట్లు 19 క్రీడాంశాల్లో 141 ఈవెంట్లలో పాల్గొంటున్నారు.