Adam Gilchrist: భారత క్రికెటర్లు విదేశీ లీగ్ లు ఆడకపోవడంపై గిల్ క్రిస్ట్ స్పందన
- ఐపీఎల్ కే పరిమితమైన భారత క్రికెటర్లు
- భారత క్రికెటర్లను అనుమతించాలన్న గిల్ క్రిస్ట్
- తానేమీ ఐపీఎల్ కు వ్యతిరేకం కాదని స్పష్టీకరణ
ప్రపంచంలో అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి గుర్తింపు ఉంది. ఐపీఎల్ వచ్చాక బీసీసీఐ ఆర్థికంగా మరింత బలపడిందనడంలో సందేహంలేదు. అయితే, ఐపీఎల్ కోసం విదేశీ క్రికెటర్లను ఆహ్వానించే భారత క్రికెట్ బోర్డు, టీమిండియా క్రికెటర్లను మాత్రం విదేశీ లీగ్ లలో ఆడేందుకు అనుమతించడంలేదు. దీనిపై చాలా విమర్శలున్నాయి. తాజాగా ఈ అంశంపై ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్ క్రిస్ట్ స్పందించాడు.
భారత్ వెలుపల నిర్వహించే టీ20 లీగ్ లలో ఆడేందుకు టీమిండియా క్రికెటర్లను అనుమతించాలని గిల్ క్రిస్ట్ బీసీసీఐని కోరాడు. విదేశీ గడ్డపై నిర్వహించే ఇతర లీగ్ లలో భారత క్రికెటర్లు కూడా ఆడుతుంటే ఎంతో అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నాడు. భారత క్రికెటర్లు విదేశీ లీగ్ లలో ఆడినంత మాత్రాన ఐపీఎల్ కు నష్టమేమీ ఉండదని భావిస్తున్నట్టు గిల్లీ తెలిపాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి చోట్ల భారత క్రికెటర్లు లీగ్ లు ఆడుతుంటే, వారి బ్రాండ్ నేమ్ మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డాడు.
"అలాగని ఐపీఎల్ కు నేనేమీ వ్యతిరేకం కాదు. ఐపీఎల్ లో ఆరు సీజన్ల పాటు ఆడాను. ఐపీఎల్ ను ఎంతగానో ఇష్టపడతాను. భారత క్రికెటర్లు కూడా బిగ్ బాష్ లీగ్ కు వచ్చి ఎందుకు ఆడకూడదు? ఈ ప్రశ్నకు నిజాయతీతో కూడిన సమాధానాన్ని ఇప్పటివరకు అందుకోలేకపోయాను. కొన్ని లీగ్ లు ప్రపంచంలోని ఏ ఆటగాడ్నయినా ఆడేందుకు అనుమతిస్తాయి. కానీ ఏ భారత క్రికెటర్ కూడా ఏ ఇతర టీ20 లీగ్ లలో కనిపించడు. నేనేమీ రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడడంలేదు. నేనడుగుతున్నది సహేతుకమైన ప్రశ్నే కదా?" అంటూ గిల్ క్రిస్ట్ విమర్శనాత్మకంగా స్పందించాడు.