Manisha Rupeta: పాకిస్థాన్‌లో డీఎస్పీగా హిందూ యువతి.. ఆ ఘనత సాధించిన తొలి హిందూ మహిళగా మనీషా రికార్డ్!
- పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో మనీషాకు 16వ ర్యాంకు
- ఆమె ముగ్గురు తోబుట్టువులూ వైద్యులే
- మహిళలపై వేధింపులే తనను పోలీసు ఉద్యోగానికి పురికొల్పాయన్న మనీషా
- మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య
పాకిస్థాన్‌లో హిందూ మహిళకు అరుదైన గౌరవం లభించింది. సింధు ప్రావిన్స్‌లోని జాకోబాబాద్‌కు చెందిన మనీషా రూపేటా పోలీస్ శాఖలో డీఎస్పీగా ఎంపికయ్యారు. ఫలితంగా ఆ ఘనత సాధించిన తొలి హిందూ మహిళగా రికార్డులకెక్కారు. 2019లో మనీషా సింధ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి 16వ ర్యాంకు సాధించారు. ఆమె గతంలో మెడిసిన్‌కు కూడా ప్రిపేరైనప్పటికీ సాధించలేకపోయారు. ఆమె ముగ్గురు తోబుట్టువులు మెడిసిన్ చదివారు. మనీషా ఎంబీబీఎస్ సాధించకపోవడంతో పోలీస్ సర్వీసులో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఫిజికల్ థెరపీలో డిగ్రీ చేశారు.
డీఎస్పీగా ఎంపికైన మనీషా మాట్లాడుతూ.. తనకు పోలీసు ఉద్యోగమంటే ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. పోలీసు ఉద్యోగానికి ఎంతగానో కష్టపడాల్సి వచ్చిందన్నారు. తాను డీఎస్పీ కావడంతో తమ కమ్యూనిటీ ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. మహిళలకు టీచర్, డాక్టర్ ఉద్యోగాలు మంచిదని, పురుషులు ఎక్కువగా ఉండే పోలీసు శాఖలో మహిళలు ఇమడలేరని చెబుతున్నారని, చిన్నప్పటి నుంచి తాను ఇలాంటి మాటలు వింటున్నానని మనీషా తెలిపారు. ఈ ఆలోచనా విధానాన్ని మార్చాలన్నదే తన అభిమతమన్నారు.
మహిళలపై వేధింపులు, నేరాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేసిన మనీషా.. వారికి రక్షణగా ఉండాలన్న ఉద్దేశంతోనే పోలీసు ఉద్యోగాన్ని ఎంచుకున్నట్టు తెలిపారు. మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఉన్నత కుటుంబాల్లోని మహిళలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లరన్న భావన ఉందని, ఇది మారాలని అన్నారు. సాధారణంగా పాకిస్థానీ మహిళలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లరని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే కుటుంబంలోని వ్యక్తిని తీసుకుని వెళ్తారని అన్నారు. కాగా, పాకిస్థాన్‌లో డీఎస్పీగా ఎంపికైన మనీషాను అభినందిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.