West Bengal: నోట్ల కట్టలు దొరికిన అర్పిత ముఖర్జీ నివాసంలో నాలుగు లగ్జరీ కార్ల మాయం

4 luxury cars missing from Arpita Mukherjee residence

  • ఆమె అరెస్టయినప్పటి నుంచి కార్లు కనిపించడం లేదని గుర్తించిన అధికారులు
  • బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ స్కాంలో అరెస్టయిన కేసులో ఈడీ కస్టడీలో ఉన్న మాజీ మంత్రి పార్థ ఛటర్జీ, అర్పిత
  • అర్పిత నివాసాల్లో రూ. 50 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న ఈడీ

బెంగాల్ లో టీచర్ రిక్రూట్ మెంట్ కుంభకోణంలో ఈడీ అధికారులు మాజీ మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ నివాసాల్లో దాదాపు రూ. 50 కోట్ల రూపాయలు స్వాదీనం చేసుకున్న కేసులో మరో ట్విస్ట్. అర్పిత ముఖర్జీ ఇంట్లో నాలుగు లగ్జరీ కార్లు మాయం అయిన విషయం తాజాగా వెల్లడవడం సంచలనం సృష్టించింది. అర్పిత అరెస్టయినప్పటి నుంచి కోల్‌కతాలోని డైమండ్ సిటీ కాంప్లెక్స్‌లోని ఆమె నివాసంలో నాలుగు లగ్జరీ కార్లు కనిపించడం లేదని అధికారులు గుర్తించారు. అవి ఏమయ్యాయో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజీలను అధికారులు పరిశీలిస్తున్నారు. 

 బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అయిన అర్పిత ముఖర్జీకి చెందిన నివాసాల్లో రెండుసార్లు సోదాలు జరిపిన అధికారులు రూ. 50 కోట్ల నగదు సీజ్ చేశారు. అంతేకాదు, 11 కిలోల బంగారాన్ని కూడా గుర్తించారు. తొలి దఫాలో రూ. 21.90, రెండోసారి 27.90 కోట్లు సీజ్ చేశారు. రెండో పర్యాయం రూ.27.90 కోట్ల నగదును లెక్కించేందుకు 8 మంది బ్యాంకు అధికారులు నాలుగు క్యాష్ కౌంటింగ్ యంత్రాలతో 13 గంటలు శ్రమించాల్సి వచ్చింది. 

కాగా, ఈ కుంభకోణంలో అరెస్టయిన పార్థ ఛటర్జీ, అర్పిత ముఖర్జీని ఆగస్టు మూడో తేదీ వరకు కోర్టు ఈడీ కస్టడీకి అప్పగించింది. గతంలో పార్థ ఛటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ కుంభకోణం జరిగినట్టు ఈడీ ఆధారాలు సేకరిస్తోంది. ప్రస్తుతం వాణిజ్య, ఐటీ మంత్రిగా ఉన్న పార్థ ఛటర్జీ కుంభకోణంలో చిక్కుకోవడంతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించారు.

  • Loading...

More Telugu News