CM KCR: కేసీఆర్ ఢిల్లీలో ఏ చీకటి రాచకార్యాలు వెలగబెడుతున్నారో!: రేవంత్ రెడ్డి
- రాష్ట్రంలో రైతుల కష్టం వరద పాలైందన్న రేవంత్
- వెంటనే నష్టం అంచనాకు క్షేత్ర స్థాయికి బృందాలను పంపాలని డిమాండ్
- ఎకరానికి రూ.15 వేలు నష్టపరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి
భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పంటలు నీట మునిగాయని.. రైతుల కష్టం వరద పాలైందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం పంట నష్టం అంచనా వేయాలన్న సోయి ఏ మాత్రం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల కష్టాలను పట్టించుకోకుండా.. సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఏ చీకటి రాచకార్యాలు వెలగబెడుతున్నారో తెలియదని వ్యాఖ్యానించారు.
పంట నష్టం అంచనా కోసం తక్షణమే క్షేత్ర స్థాయికి అధికార బృందాలను పంపించాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో పంట నష్టంపై ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని జత చేస్తూ ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీ హామీ ఇచ్చిన ఉద్యోగాలేవీ..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికలకు ముందు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తారని హామీ ఇచ్చారని.. అంటే ఇన్నేళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాల్సిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కానీ పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఓ సమాధానం అసలు వాస్తవాలను బయటపెట్టిందని చెప్పారు. 2014 నుంచి 2022 మధ్య ఏకంగా 22 కోట్ల దరఖాస్తులు వస్తే.. కేంద్రం ఇచ్చిన ఉద్యోగాలు కేవలం ఏడు లక్షల 22 వేలు మాత్రమేనని పేర్కొన్నారు. ఈ మేరకు లోక్ సభలో కేంద్రం ఇచ్చిన సమాధానానికి సంబంధించిన ప్రతిని జత చేస్తూ ట్వీట్ చేశారు.