Pakistan: తలకుమించిన భారంగా నిర్వహణ వ్యయం.. జూలోని సింహాలను చవగ్గా అమ్మేస్తున్న పాకిస్థాన్!
- నిధుల సేకరణలో భాగంగానే విక్రయిస్తున్నామన్న జూ అధికారులు
- ఒక్కో సింహం ఖరీదు రూ. 1.5 లక్షలు మాత్రమే
- గతేడాది కూడా 14 సింహాలను అమ్మేసిన జూ
పాకిస్థాన్‌లో ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. ద్రవ్యోల్బణం రోజురోజుకు పెరిగిపోతుండడంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రజల పరిస్థితి ఇలా ఉంటే.. మరోవైపు, లాహోర్‌లో ఓ జూ ఇచ్చిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నిర్వహణ వ్యయం తలకుమించిన భారంగా మారడంతో జూలో సింహాలను చవగ్గా విక్రయించేందుకు ముందుకొచ్చింది. ఎవరైనా సరే వీటిని కొనుక్కోవచ్చని ప్రకటించింది.
లాహోర్ సఫారీ జూ 142 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో 40 సింహాలు సహా పలు వన్య ప్రాణులు ఉన్నాయి. వీటికి ఆహారం అందించడంతోపాటు జూ నిర్వహణ భారంగా మారడంతో ఏం చేయాలో అర్థం కాని జూ అధికారులు సింహాలను అమ్మేయాలని నిర్ణయించారు. జూలోని మొత్తం 40 సింహాల్లో మూడు ఆడవి సహా మొత్తం 12 మృగరాజులను విక్రయించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
ఒక్కో సింహం ఖరీదు అత్యంత చవగ్గా రూ. 1.5 లక్షలు (పాక్ కరెన్సీలో) మాత్రమేనని, ఆశావహులు వచ్చి కొనుక్కోవచ్చని ప్రకటించింది. జాతిగేదెల ఖరీదు కంటే అత్యంత చవగ్గా విక్రయిస్తున్నట్టు చెప్పడంతో ఆశావహులు వాటి కొనుగోలుకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. నిధుల సేకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్న అధికారులు ఆగస్టు తొలి వారంలో వాటిని విక్రయిస్తామని తెలిపారు. అయితే, సింహాలను ఇలా విక్రయించడం ఇదే తొలిసారి కాదని, గతేడాది 14 సింహాలను ఇలాగే విక్రయించిందని స్థానిక టీవీ ఒకటి పేర్కొంది.