Mallu Bhatti Vikramarka: ప్రజలు కష్టాల్లో ఉంటే కేసీఆర్ ఢిల్లీకి ఎందుకెళ్లారు?: భట్టి విక్రమార్క
- భారీ వర్షాలతో హైదరాబాద్ ప్రజలు కష్టాలు పడుతున్నారన్న భట్టి
- ప్రజల బాధలను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేేదని విమర్శ
- రాజగోపాల్ రెడ్డితో పార్టీ అధిష్ఠానం మాట్లాడుతోందని వివరణ
భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ ప్రజలు కష్టాలు పడుతున్నారని... ప్రజలు కష్టాల్లో ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ప్రజల బాధలను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. తెలంగాణ ఆదాయాన్ని మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు ధారపోశారని... ఆ ప్రాజెక్టు ద్వారా ఒక ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు.
మునుగోడులో ఉప ఎన్నిక ఖాయమంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... ప్రజలు ఉప ఎన్నిక కోరుకోవడం లేదని అన్నారు. రాజగోపాల్ రెడ్డితో అధిష్ఠానం మాట్లాడుతోందని చెప్పారు. కోమటిరెడ్డికి ఉన్న ఇబ్బంది తెలసుకుని, పరిష్కరిస్తామని తెలిపారు. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండేలా సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తామని చెప్పారు. మరోపక్క, రాజగోపాల్ రెడ్డితో ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వంశీచంద్ రెడ్డిలు జరిపిన చర్చలు కూడా విఫలమైన సంగతి తెలిసిందే.