High BP: చిన్నారుల్లోనూ, టీనేజర్లలోనూ హైబీపీ... ఎందుకు వస్తుందో చెప్పిన నిపుణులు
- పిల్లల్లోనూ హైబీపీ
- జీవనశైలే కారణమంటున్న పరిశోధకులు
- పనిలేకపోవడం, తిండి కారణమని వెల్లడి
- తగిన వ్యాపకాలు, కసరత్తులు అవసరమని వివరణ
అధిక రక్తపోటు (హైబీపీ)... ప్రపంచంలో చాలామంది ఈ ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నవారే. సాధారణంగా పెద్దవారిలో ఈ హైబీపీ లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే, పిల్లల్లోనూ, టీనేజర్లలోనూ అధిక రక్తపోటు కేసులు వెల్లడవుతున్నాయని ఓ అధ్యయనం చెబుతోంది. బాలల్లో హైబీపీకి వారి జీవనశైలే కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పెద్దగా పనిలేకపోవడం, చక్కెరలు, ఉప్పు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల వారిలో అధిక రక్తపోటుకు దారితీస్తోందని ఆ అధ్యయనంలో వివరించారు.
హైబీపీతో బాధపడుతున్న 10 మంది బాలలను తీసుకుంటే, వారిలో 9 మందిపై అంశాల కారణంగానే హైబీపీ బారినపడుతున్నారని వెల్లడైంది. ఈ అధ్యయనం కోసం 6 నుంచి 16 ఏళ్ల వయసున్న బాలల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించారు. సదరు బాలల సంపూర్ణ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని వారి తల్లిదండ్రులకు నిపుణులు సూచించారు. పిల్లల ఆరోగ్యంలో గణనీయమైన మార్పులకు వారి తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న ఇటలీకి చెందిన ప్రొఫెసర్ గియోవనీ డి సిమోన్ (యూనివర్సిటీ ఆఫ్ నేపుల్స్-2) అంటున్నారు.
హైబీపీ, ఊబకాయం వంటి రుగ్మతలు చాలా తరచుగా ఒకే ఫ్యామిలీలోని వ్యక్తుల్లో కనిపిస్తుంటాయని, అందుకే ఇలాంటి కుటుంబాల్లోని వ్యక్తులందరూ కూడా తమ జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా, హైబీపీతో బాధపడే పిల్లలకు తాజా కూరగాయలు, ఫలాలు, పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహారం అందించాలని, తగు మోతాదులో ఉప్పు వాడకం, స్వీట్లు, శీతల పానీయాలు, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉంచడం వల్ల వారిలో హైబీపీ లక్షణాలను అదుపులో ఉంచవచ్చని సిమోన్ పేర్కొన్నారు.
పిల్లలు, టీనేజర్లు రోజులో కనీసం ఒక గంట పాటైనా కసరత్తులు చేయాలని, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ చేయాలని సూచించారు. రెండు గంటలకు మించి ఒకే చోట కదలకుండా కూర్చోవడం వంటివి చేయరాదని తెలిపారు. పిల్లలు అదేపనిగా టీవీ, స్మార్ట్ ఫోన్ వినియోగిస్తుంటే తల్లిదండ్రులు వారిని గమనిస్తుండాలని, వారిని ఇతర శారీరక పనుల వైపు మళ్లించాలని వెల్లడించారు. తరచుగా వారి బరువు, ఆహారపు అలవాట్లు, వ్యాయామ సమయం వంటి అంశాలల్లో వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించి, అందుకు అనుగుణంగా వారిని పరిశీలిస్తుండాలని ప్రొఫెసర్ సిమోన్ వివరించారు.