Telangana: తెలంగాణలో విచిత్ర వాతావరణం.. కొన్ని చోట్ల భానుడి భగభగలు.. మరికొన్ని చోట్ల కుండపోత వాన!

Rains and Temperature raised in telangana same day
  • సాధారణం కంటే ఐదారు డిగ్రీలు ఎక్కువగా నమోదు
  • నల్గొండ జిల్లా కేతేపల్లిలో అత్యధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
  • జగిత్యాల జిల్లా కోల్వాయిలో అత్యధికంగా 8.1 సెం.మీ. వర్షపాతం నమోదు
  • నేడు ఓ మోస్తరు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం
తెలంగాణలో విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఓవైపు వర్షం కుమ్మేస్తే, మరోవైపు భానుడు భగభగలాడిపోయాడు. ఫలితంగా సాధారణం కంటే 5 నుంచి 6 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైంది. నల్గొండ జిల్లా కేతేపల్లిలో నిన్న అత్యధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, నల్గొండలో 38 డిగ్రీలు నమోదైంది. భద్రాచలంలో నిన్న రాత్రి 26 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జులై నెలలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారని వాతావరణశాఖ పేర్కొంది.

మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం వాన దంచికొట్టింది. జగిత్యాల జిల్లా కోల్వాయిలో అత్యధికంగా 8.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, కుమురంభీం జిల్లా కెరిమెరిలో అత్యల్పంగా 5.4 సెంటీమీటర్ల వాన కురిసింది. బంగాళాఖాతం ఆగ్రేయ ప్రాంతంలో గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో నేడు ఓ మోస్తరు వర్షాలు, రేపు (సోమవారం) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
Telangana
Temperature
Rains

More Telugu News