Ram Surat Rai: మీరందరూ బతికున్నారంటే అది ప్రధాని మోదీ చలవే: బీహార్ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
- ముజఫర్ నగర్ లో బహిరంగ సభ
- మోదీ అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చారని వెల్లడి
- అనేక దేశాలు ఇంకా కొట్టుమిట్టాడుతున్నాయని వ్యాఖ్యలు
- పాక్ ను ఉదహరించిన రామ్ సూరత్ రాయ్
బీహార్ మంత్రి రామ్ సూరత్ రాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయులు ఇవాళ ప్రాణాలతో ఉన్నారంటే అది ప్రధాని నరేంద్ర మోదీ చలవేనని ప్రశంసల జల్లు కురిపించారు. భారత్ లో మోదీ నాయకత్వంలో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారని కొనియాడారు.
ముజఫర్ పూర్ లో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ, "మీరందరూ బతికున్నారంటే అందుకు కారణం ప్రధాని మోదీయే. ఆ ఘనత ఆయనకే దక్కుతుంది. కరోనా సంక్షోభ సమయంలో వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయడమే కాకుండా, దేశ ప్రజలందరికీ ఉచితంగా పంచిపెట్టారు" అని వివరించారు.
ఇప్పటికీ అనేక దేశాలు కరోనా సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంటే, భారత్ లో మాత్రం ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చర్యలు వేగంగా జరుగుతున్నాయని రామ్ సూరత్ రాయ్ పేర్కొన్నారు. "ఓసారి పాకిస్థానీలను అడగండి... వాళ్ల పరిస్థితి ఏమిటో మనం టీవీల్లో చూస్తుంటాం. భారత్ లో మాత్రం అలాంటి పరిస్థితులు లేవు. మనం ఎంతో ప్రశాంతంగా ఉన్నాం" అని తెలిపారు.