YS Sharmila: విషపు కూడు పెట్టి విద్యార్థులను చంపుతారా?.. టీఆర్ఎస్ సర్కారుపై వైఎస్ షర్మిల ఫైర్
- ప్రభుత్వ హాస్టళ్లలో పరిస్థితి దారుణంగా ఉందని మండిపాటు
- పేద విద్యార్థులకు కడుపు నిండా అన్నం పెట్టడం కూడా బరువేనా అని నిలదీత
- ఇప్పటికైనా విద్యార్థులకు మంచి ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్
టీఆర్ఎస్ సర్కారు, సీఎం కేసీఆర్ హాస్టళ్లలో విద్యార్థులకు విషపు కూడు పెట్టి చంపేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్ టీపీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఉస్మానియా హాస్టల్ నుంచి గ్రామాల్లో ఉన్న గురుకుల హాస్టళ్ల వరకు ఎక్కడ చూసినా పరిస్థితి దారుణంగా ఉందని మండిపడ్డారు. పురుగులు పడిన అన్నం పెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్ షర్మిల వరుసగా ట్వీట్లు చేశారు.
విద్యార్థి ప్రాణాలు కోల్పోయినా పట్టించుకోరా?
‘‘ఉస్మానియా హాస్టల్ నుంచి ఊరిలో ఉన్న గురుకుల హాస్టళ్ల వరకు ఎక్కడచూసినా పురుగుల అన్నం, ముక్కపట్టిన బియ్యం, కూరల్లో వానపాములు, బొద్దింకలు, ఎలుకలు.
మొన్న బాసర త్రిబుల్ ఐటీలో వందల మంది విద్యార్థులు, నిన్న మహబూబాబాద్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 36 మంది విద్యార్థులు, ఇవాళ సిద్దిపేట సాంఘిక సంక్షేమ హాస్టల్ లో 22 మందికి ఫుడ్ పాయిజన్.
సర్కారు భోజనం తిని ఓ విద్యార్ధి ప్రాణాలు కోల్పోయినా కానీ కళ్లు తెరవలేదు. అయ్యా కేసీఆర్ గారు.. కనీసం మా పేద విద్యార్థులకు బుక్కెడు అన్నం పెట్టడం కూడా బరువేనా?
చదువుల కోసం పంపిస్తే వాళ్లకు విషపు కూడు పెట్టి చంపేస్తున్నారు కదా. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి.” అని షర్మిల తన ట్వీట్లలో పేర్కొన్నారు.