Chandrababu: పోలవరం నిర్వాసితులు, వరద బాధితుల కష్టాలపై సీఎస్ కు లేఖ రాసిన చంద్రబాబు
- పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్
- న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వెల్లడి
- వరద బాధితులకు సాయం పెంచాలని స్పష్టీకరణ
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎస్ సమీర్ శర్మకు లేఖ రాశారు. పోలవరం నిర్వాసితుల కష్టాలను, ఇటీవలి గోదావరి వరద బాధితుల కడగండ్లను తన లేఖలో వివరించారు. పోలవరం నిర్వాసితుల అంశాన్ని వివరిస్తూ... పోలవరం కోసం త్యాగాలు చేసిన వారిని విస్మరించరాదని తెలిపారు. గ్రామాలకు గ్రామాలనే ఇచ్చేశారని, ఇళ్లు వదులుకున్నారని, వారికి న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే, పోలవరం నిర్వాసితులకు దశలవారీగా పరిహారం అనే విధానం కాకుండా, ఒకేసారి అందరికీ సాయం అందించాలని స్పష్టం చేశారు.
గోదావరి వరదల గురించి ప్రస్తావిస్తూ... ఇటీవల తాను 4 జిల్లాల్లో పర్యటించానని, ప్రభుత్వం నుంచి బాధితులకు సరైన సాయం అందలేదని గుర్తించానని తెలిపారు. గతంలో హుద్ హుద్ తుపాను, తిత్లీ తుపానులు సంభవించినప్పుడు టీడీపీ ప్రభుత్వం పరిహారం పెంచి ఇచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. అప్పటితో పోల్చితే ఇప్పుడు వరద నష్టం తీవ్రంగా ఉందని, అందుకే పరిహారం ఇంకా పెంచి ఇవ్వాలని కోరారు.
తాను పర్యటించిన జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయని వెల్లడించారు. అసలు, కొన్నిప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికీ ఇళ్లలోకి తిరిగి వెళ్లలేకపోతున్నారని, అంతటి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. పూర్తిగా దెబ్బతిన్న గృహాలకు రూ.50 వేలు చెల్లించాలని, రూ.2.50 లక్షలతో కొత్త నివాస గృహం నిర్మించి ఇవ్వాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఇవ్వాలని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు.