RN Ravi: తుపాకీ చేతబట్టి వస్తే తుపాకీతోనే సమాధానం చెబుతాం: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి

Tamilnadu governor RN Ravi slams Manmohan Singh ruling towards security
  • కొచ్చిలో ఓ సదస్సుకు హాజరైన తమిళనాడు గవర్నర్
  • దేశ భద్రత అంశాలపై ప్రసంగం
  • గతంలో మన్మోహన్ హయాంలో పరిస్థితులపై వ్యాఖ్యలు
  • ఇప్పుడు భద్రత ఎంతో మెరుగ్గా ఉందని వెల్లడి
దేశంలో హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి వ్యాఖ్యానించారు. అంతర్గత భద్రతకు ప్రస్తుత సవాళ్లు అనే అంశంపై కొచ్చిలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కశ్మీర్ అంశంపై మాట్లాడుతూ, తుపాకీ చేతబట్టి వచ్చినవాళ్లకు తుపాకీతోనే సమాధానం చెప్పడం జరుగుతుందని స్పష్టం చేశారు. 

దేశ ఐక్యత, సమగ్రతకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లతో ఎలాంటి చర్చలు ఉండవని అన్నారు. గత ఎనిమిదేళ్లలో ఏ సాయుధ మూకలతోనూ చర్చలు జరపలేదని, ఆయుధం చేతబట్టినవాళ్లు లొంగిపోతానంటే వారితో సంప్రదింపులు మాత్రం ఉంటాయని వివరించారు. 

ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పైనా ఆర్ఎన్ రవి ధ్వజమెత్తారు. నాడు మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలో... ముంబయిలో 26/11 ఉగ్రదాడులు జరిగిన కొన్నినెలలకే పాకిస్థాన్ తో టెర్రరిజంపై ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. 

"26/11 సమయంలో కొంతమంది ఉగ్రవాదుల భయానక దాడులతో యావత్ దేశం నిశ్చేష్టకు గురైంది. అయితే ఆ దాడులు జరిగిన 9 నెలల్లోపే మన ప్రధాని, పాక్ ప్రధానితో ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండు దేశాలు ఉగ్రవాద బాధిత దేశాలేనంటూ సంయుక్త ప్రకటన చేశారు. పాకిస్థాన్ మనకు శత్రువా, మిత్రదేశమా?" అంటూ ప్రశ్నించారు. 

కానీ, పుల్వామా దాడుల తర్వాత పాక్ కు గట్టిగా బుద్ధి చెప్పగలిగామని, మన శక్తిసామర్థ్యాలు ఉపయోగించి బాలాకోట్ లో సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించామని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి వివరించారు. తద్వారా, ఉగ్రవాద చర్యలకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్న సందేశాన్ని పంపగలిగామని పేర్కొన్నారు. మన్మోహన్ హయాం కంటే ఇప్పుడు దేశంలో అంతర్గత భద్రత మరింత మెరుగ్గా ఉందని ఉద్ఘాటించారు. 

మన్మోహన్ హయాంలో అంతర్గత భద్రత దారుణంగా ఉందని, మావోయిస్టు హింస ప్రజ్వరిల్లిందని వివరించారు. మధ్యభారతంలో 185 జిల్లాలకు మావోలు విస్తరించారని, రెడ్ కారిడార్ అంటూ ప్రచారం జరిగిందని వెల్లడించారు. అయితే, ఇప్పుడా పరిస్థితి లేదని, మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిపోయిందని, వారు ఓ 8 జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యారని పేర్కొన్నారు.
RN Ravi
Security
Violence
Manmohan Singh
India
Pakistan
Maoists
Jammu And Kashmir

More Telugu News