Nara Lokesh: మంత్రి పెద్దిరెడ్డి పాపాలు చేయడంలో శిశుపాలుడ్ని మించిపోయారు: నారా లోకేశ్

Lokesh slams minister Peddireddy
  • మంత్రి పెద్దిరెడ్డిపై లోకేశ్ విమర్శనాస్త్రాలు
  • మాఫియా కింగ్ పిన్ అయ్యారని వ్యాఖ్యలు
  • పాడిరైతులపై గూండాయిజం చేస్తున్నారని ఆరోపణ
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. మంత్రి పెద్దిరెడ్డి పాపాలు చేయడంలో శిశుపాలుడ్ని మించిపోయారని ఆరోపించారు. ఎర్రచందనం రవాణాలో నయా వీరప్పన్ గా పేరుపొందిన పుంగనూర్ డాన్ మంత్రి అయ్యాక వైన్, మైన్, ల్యాండ్, శాండ్ మాఫియాలకు కింగ్ పిన్ అయ్యారని అన్నారు.  

పాడిరైతుల పాలిట పాపాల భైరవుడు అయ్యారని లోకేశ్ విమర్శించారు. పెద్దిరెడ్డికి చెందిన సొంత శివశక్తి డెయిరీ అన్ని డెయిరీలు, సహకార సంఘాల కంటే లీటర్ పాలకి అతి తక్కువ ధర ఇస్తోందని ఆరోపించారు. ఎక్కువ ధర ఇచ్చే డెయిరీలు పాలసేకరణకు వస్తే వారిపై పెద్దిరెడ్డి గ్యాంగ్ గూండాయిజం చేస్తోందని తెలిపారు. దీనిపై నిలదీసిన రైతులను బెదిరింపులతో భయపెడుతున్నారని లోకేశ్ అన్నారు.  

పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం వల్లిగట్ట గ్రామ పాడిరైతులు శ్రీజ డెయిరీకి పాలు పోస్తుండేవారని, అయితే పెద్దిరెడ్డికి చెందిన శివశక్తి డెయిరీ మేనేజర్ పురుషోత్తంరెడ్డి పాలసేకరణ చేస్తే అంతుచూస్తామంటూ శ్రీజ డెయిరీ వారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇది పెద్దిరెడ్డి మాఫియా కార్యకలాపాలకు పరాకాష్ఠ అని లోకేశ్ విమర్శించారు. 

బెదిరింపులకు భయపడిన శ్రీజ డెయిరీ నిలిపివేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని వివరించారు. తాము పాలు పారబోస్తాం కానీ, పాపాల భైరవుడు పెద్దిరెడ్డి డెయిరీకి పాలు పోసేది లేదంటున్న రైతులను ఏం చేస్తావు పాపాల భైరవా పెద్దిరెడ్డీ? అంటూ లోకేశ్ ప్రశ్నించారు.
Nara Lokesh
Peddireddi Ramachandra Reddy
Punganuru
Dairy

More Telugu News