TDP: ఎన్టీఆర్ కూతురుది ఆత్మహత్య?... మానసిక ఒత్తిడే కారణమంటూ కథనాలు!
- కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఉమా మహేశ్వరి
- ఈ క్రమంలోనే మానసిక ఒత్తిడికి గురైనట్లు సమాచారం
- మానసిక ఒత్తిడి తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానం
- శవ పరీక్ష కోసం ఉస్మానియా ఆసుపత్రికి ఉమా మహేశ్వరి మృత దేహం
టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి మరణం పట్ల అనుమానాలు వ్యక్తమవుతూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 52 ఏళ్ల వయసున్న ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకుని మరణించిందని తెలుస్తోంది. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉమా మహేశ్వరి తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని సమాచారం.
ఎన్టీఆర్కు నాలుగో కుమార్తె అయిన ఉమా మహేశ్వరికి ఇద్దరు కూతుళ్లు ఉండగా... పెద్ద కుమార్తెకు గతంలోనే వివాహం చేసిన ఉమా మహేశ్వరి చిన్న కుమార్తెకు కూడా ఇటీవలే పెళ్లి చేశారు. చిన్న కుమార్తె పెళ్లి తర్వాత అనారోగ్యానికి గురైన ఉమా మహేశ్వరి తీవ్ర మానసిన ఒత్తిడికి గురైనట్లు సమాచారం. ఈ ఒత్తిడి తట్టుకోలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డట్లుగా సమాచారం. ప్రస్తుతం ఉమా మహేశ్వరి మృత దేహాన్ని శవ పరీక్ష కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.