Ayman al-Zawahri: ఇంతకీ.. ఎవరీ అల్ జవహరి? ఎందుకు ఉగ్రవాదిగా మారాడు?
- ఈజిప్టుకు చెందిన అల్ జవహరికి చిన్నప్పటి నుంచే మతపరమైన అంశాలపై ఆసక్తి
- నేత్ర వైద్యుడైన జవహరి మధ్య ఆసియా, మధ్య ప్రాచ్యాన్ని చుట్టేశాడు
- ఈజిప్టు జైలులో చిత్రహింసలకు గురైన తర్వాత పూర్తిస్థాయిలో ఉగ్రవాదంవైపు నడక
- యువకుడిగా ఉన్న బిన్‌లాడెన్‌తో కలిసి నడిచిన జవహరి
- తన సొంత సంస్థను అల్‌ఖైదాలో విలీనం చేసిన వైనం
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో ఆదివారం అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో అల్ ఖైదా చీఫ్ అయమన్ అల్ జవహరి హతమయ్యాడు. ఈ విషయాన్ని అమెరికా ధ్రువీకరించింది. అమెరికాలో 11 సెప్టెంబరు 2001లో ట్విన్ టవర్స్‌పై జరిగిన దాడికి ప్రతీకారంగా అల్‌ఖైదా వ్యవస్థాపకుడు ఒసామాబిన్ లాడెన్‌ను హతమార్చిన అమెరికా.. ఆ దాడికి సాయం చేసిన ప్రస్తుత చీఫ్ జవహరిని తాజాగా మట్టుబెట్టింది. ఆఫ్ఘన్ గడ్డను అమెరికా దళాలు వదిలి వెళ్లిన 11 నెలల తర్వాత జవహరిని హతమార్చడం గమనార్హం. ట్విన్ టవర్స్‌పై దాడి తర్వాత 21 సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతున్న జవహరిని హతమార్చడం ద్వారా అమెరికా బలగాలు ఘన విజయం సాధించినట్టు అయింది.
అల్ జవహరి ఎక్కడివాడు?
నిజానికి అమెరికన్లు అల్ జవహరి పేరును మర్చిపోలేరు. రెండు దశాబ్దాలుగా అతడి ముఖం చిరపరిచితమే. కళ్లకు అద్దాలు, చిరునవ్వుతో లాడెన్ పక్కన కూర్చున్న అతడి ఫొటోలు పలుమార్లు మీడియాలో దర్శనమిచ్చాయి. అల్ జవహరి ఈజిప్టుకు చెందినవాడు. 19 జూన్ 1951లో జన్మించాడు. ఉన్నత కుటుంబంలోనే పుట్టాడు. బాల్యం నుంచే మతంపై ఆసక్తి పెంచుకున్నాడు. మతపరమైన అంశాలను గమనించేవాడు. నేత్ర వైద్యుడు, సర్జన్ అయిన అల్ జవహరి మధ్య ఆసియా, మధ్యప్రాచ్యం మొత్తం తిరిగాడు. సోవియట్ యూనియన్ ఆక్రమణకు వ్యతిరేకంగా జరిగిన ఆప్ఘనిస్థాన్ యుద్ధాన్ని కళ్లారా చూశాడు. ఆ సమయంలోనే యువకుడైన ఒసామాబిన్ లాడెన్‌ను, సోవియట్ బలగాలను ఆఫ్ఘన్ నుంచి వెళ్లగొట్టేందుకు సాయపడుతున్న అరబ్ తీవ్రవాద గ్రూపులను కలిశాడు.
1981లో ఈజిప్టు అధ్యక్షుడు అన్వర్ సాదత్‌ను ఇస్లామిక్ ఛాందసవాదులు హత్య చేసిన తర్వాత వందలాది మంది ఉగ్రవాదులను ఈజిప్టు అరెస్టు చేసి జైలులో చిత్రహింసలకు గురిచేసింది. వారిలో అల్ జవహరి కూడా ఒకడు. ఈ అనుభవం అతడిని ఆ తర్వాత పూర్తిస్థాయి ఉగ్రవాదంవైపు నడిపించిందని చరిత్రకారులు చెబుతారు.
ఈ ఘటన జరిగిన సరిగ్గా ఏడేళ్ల తర్వాత బిన్ లాడెన్ స్థాపించిన అల్ ఖైదా ఉగ్రసంస్థలో అల్ జవహరి కనిపించాడు. అనంతరం తన సొంత ఈజిప్షియన్ మిలిటెంట్ గ్రూపును అల్ ఖైదాలో విలీనం చేశాడు. అల్‌ఖైదాను సరికొత్తగా తీర్చిదిద్దాడు. సంస్థాగత నైపుణ్యం, అనుభవాన్ని జోడించాడు. అండర్‌గ్రౌండ్‌కి వెళ్లడం ద్వారా ఈజిప్షియన్ ఇంటెలిజెన్స్ నుంచి తప్పించుకోగలిగాడు.
అల్ జవహరికి ఎందుకంత ప్రాముఖ్యం
అమెరికా ట్విన్ టవర్స్‌పై ఆత్మాహుతి దాడికి, నిధుల సేకరణకు పక్కాగా ప్రణాళికలు రచించి విజయవంతంగా దాడి చేసిన తర్వాత అల్‌ఖైదాను జాగ్రత్తగా చూసుకున్నాడు. 9/11 దాడి తర్వాత ఆప్ఘనిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో అల్‌ఖైదా నాయకత్వాన్ని జవహరి పునర్నిర్మించాడు. అంతేకాదు, ఇరాక్, ఆసియా, యెమన్ వంటి దేశాల్లో ఉన్న శాఖలకు చీఫ్‌గానూ వ్యవహరించాడు. బాలి, మొంబాసా, రియాద్, జకార్తా, ఇస్తాంబుల్, మాడ్రిడ్, లండన్ తదితర దేశాల్లోనూ అల్‌ఖైదా దాడులు నిర్వహించడంలో జవహరి కీలకంగా వ్యవహరించాడు.
2005లో లండన్‌లో అల్ ఖైదా నిర్వహించిన దాడి చివరిది. ఈ ఘటనలో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ దేశాల్లో అల్‌ఖైదా జరిపిన చివరి విధ్వంసక దాడి ఇదే. 9/11 దాడులను తీవ్రంగా పరిగణించిన అమెరికా డ్రోన్, క్షిపణి దాడులు, ఉగ్రవాద వ్యతిరేక దాడులతో ఉక్కిరిబిక్కిరైన అల్‌ఖైదా చాలామంది ప్రముఖులను కోల్పోయింది. అల్‌ఖైదా నెట్‌వర్క్‌ను యూఎస్ దారుణంగా దెబ్బతీసింది.
జవహరిని ఎలా తుదముట్టించిందంటే..!
సూర్యోదయం కావడంతో ఆదివారం ఉదయం కాబూల్‌లోని తన ఇంటి బాల్కనీలోకి జవహరి వచ్చాడు. అప్పటికే కాచుక్కూర్చున్న యూఎస్ ఇంటెలిజెన్స్ దళాలు అతడిని గుర్తించాయి. అంతే.. ఆ మరుక్షణంలోనే యూఎస్ డ్రోన్ రెండు హెల్‌ఫైర్ మిసైళ్లను ప్రయోగించింది. దీంతో అతడు కుప్పకూలిపోయాడు. నిజానికి అతడు ఆఫ్ఘనిస్థాన్‌లోనే ఉన్నట్టు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. జవహరి తన భార్య, పిల్లలను ఇటీవల కాబూల్‌లోని సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు అమెరికా గుర్తించింది. ఆ తర్వాత అతడు కూడా అదే ఇంటికి వెళ్లాడు. రక్షణగా ఉంటుందనుకున్న ఆ నివాసమే అతడి చివరి ఆవాసమైంది.