Atchannaidu: వైసీపీ ఈ సారి గెలవడం కష్టమని ఆ పార్టీ కార్యకర్తలే చెపుతున్నారు: అచ్చెన్నాయుడు
- వైసీపీ శ్రేణులే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయన్న అచ్చెన్న
- సొంత పార్టీ గెలిచే అవకాశం లేదని వాళ్లే చెపుతున్నారని వ్యాఖ్య
- చంద్రబాబు సీఎం కావాలని జనాలు ఎప్పుడో డిసైడ్ అయ్యారన్న అచ్చెన్న
వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. మూడేళ్ల పాలనలోనే జగన్ నైజం, ఆయన అసమర్థ పాలన గురించి వైసీపీ కార్యకర్తలు, అభిమానులకు కూడా అర్థమయిందని అన్నారు. జగన్ పాలనపై వైసీపీ శ్రేణులు బహిరంగంగానే అసంతృప్తిని వెళ్లగక్కుతున్నాయని చెప్పారు. ఈసారి తమ సొంత పార్టీ గెలిచే పరిస్థితి లేదని వాళ్లే చెపుతున్నారని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
గత మూడేళ్లలో దళితులపై దాడులు, ఆడపిల్లలపై అత్యాచారాలు, కల్తీ మద్యం, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై దాడులు, భూ కబ్జాలు, మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, మట్టి మాఫియా, కోర్టు ధిక్కారాలు, చెత్త రోడ్లు, పూర్తిగా నిలిచిపోయిన అభివృద్ధి, లక్షల కోట్లలో ప్రభుత్వం విచ్చలవిడిగా చేస్తున్న అప్పులు, అధికార పార్టీ నేతల ఆగడాలు చూసి చూసి... సామాన్య ప్రజలు ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ఏపీకి సీఎం కావాలని ఎప్పుడో డిసైడ్ అయిపోయారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.