Adar Poonawalla: రాష్ట్రపతితో 'సీరం' అధినేత అదర్ పూనావాలా భేటీ
- సీరం డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ను వెంటబెట్టుకుని వెళ్లిన పూనావాలా
- కొవిషీల్డ్ రూపకల్పనపై పుస్తకాన్ని రాష్ట్రపతికి అందజేసిన వైనం
- రాష్ట్రపతితో భేటీ సంతోషాన్నిచ్చిందని వ్యాఖ్య
భారత నూతన రాష్ట్రపతిగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన ద్రౌపది ముర్ముతో పలు రంగాలకు చెందిన ప్రముఖులు వరుసబెట్టి కలుస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం కరోనా వ్యాక్సిన్ తయారీ కంపెనీ సీరం ఇన్స్టిట్యూట్ అధినేత అదర్ పూనావాలా రాష్ట్రపతితో భేటీ అయ్యారు. రాష్ట్రపతి ముర్ముతో భేటీ కావడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆయన తన సోషల్ మీడియా ఖాతాల్లో పేర్కొన్నారు.
సీరం ఇన్స్టిట్యూట్లో ప్రభుత్వ, నియంత్రణ వ్యవహారాల డైరెక్టర్గా కొనసాగుతున్న ప్రకాశ్ కుమార్ సింగ్ను వెంటబెట్టుకుని రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన అదర్ పూనావాలా... రాష్ట్రపతితో సీరం సంస్థ గురించి చర్చించినట్లు వివరించారు. అంతేకాకుండా కరోనా నుంచి రక్షణ కోసం సీరం సంస్థ ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ రూపకల్పనకు తాము చేపట్టిన చర్యలతో కూడిన పుస్తకాన్ని ఆమెకు అందజేశారు.