KA Paul: అనుమతి లేకున్నా సిబ్బందిని బెదిరించి.. శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీలోకి కేఏ పాల్
- ఐదు వాహనాలతో వర్సిటీలోకి వెళ్లిన పాల్
- యూనివర్సిటీ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
- వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రిని తానేనన్న పాల్
- కేసీఆర్, జగన్, చంద్రబాబులకు డిపాజిట్లు కూడా రావని జోస్యం
ఇటీవల వార్తల్లో వ్యక్తిగా మారిపోయిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోమారు వార్తల్లోకి ఎక్కారు. అనుమతి లేకుండానే తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలోకి ప్రవేశించి హల్చల్ చేశారు. నిన్న సాయంత్రం ఆరు గంటల సమయంలో ఐదు వాహనాలతో పాల్ వర్సిటీలోకి వెళ్లారు. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారిని బెదిరించారు. విద్యార్థులను పిలిచి మాట్లాడారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థినులు పాల్‌తో సెల్ఫీలు తీసుకున్నారు. విద్యార్థినులతో వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేయించి మాట్లాడారు.
అనుమతి లేకుండా పాల్ వర్సిటీలోకి రావడం, సెక్యూరిటీ సిబ్బందిని అడ్డుకోవడంపై యూనివర్సిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే వర్సిటీకి చేరుకున్న పోలీసులు పాల్ వాహనాలను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అప్పటికే కారులోకి ఎక్కిన పాల్‌ను స్టేషన్‌కు రావాలని పోలీసులు కోరారు.
అయితే, తాను కారు దిగబోనని, తన కారులోనే వస్తానని చెప్పారు. దీంతో ఆ తర్వాత కాసేపటికే పాల్‌ను యూనివర్సిటీ నుంచి పంపించి వేశారు. అనుమతి లేకుండా మహిళా యూనివర్సిటీలోకి ప్రవేశించినందుకు కేసు నమోదు చేశారు. అంతకుముందు తిరుపతిలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన పాల్.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి తాను తెలంగాణ ముఖ్యమంత్రిని అవుతానని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్, జగన్, చంద్రబాబు పార్టీలకు డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు.