Monkeypox Virus: మంకీ పాక్స్ ముప్పు.. ఏం చేయాలి, ఏం చేయకూడదు.. కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలివిగో!
- మెల్లగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్టు
- సబ్బు, శానిటైజర్లతో ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని సూచన
- మంకీ పాక్స్ సోకినా, అనుమానం ఉన్నా.. సదరు వ్యక్తులకు దూరంగా ఉండాలని సలహా
మంకీ పాక్స్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేపుతూనే ఉంది. మన దేశంలోనూ మెల్లగా ఒక్కో కేసు బయటపడుతుండటం కలకలం సృష్టిస్తోంది. చికెన్ పాక్స్ సోకినవారిని మంకీ పాక్స్ వైరస్ గా అనుమానిస్తూ.. ఆస్పత్రులకు తరలించడం వంటి ఘటనలూ జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే మంకీ పాక్స్ వైరస్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై కేంద్ర ఆరోగ్య శాఖ పలు సూచనలు చేసింది. మంకీ పాక్స్ కు దూరంగా ఉండాలంటే.. ఏమేం చేయాలి? ఏమేం చేయకూడదు? అన్న అంశాలతో ప్రత్యేక సూచనలను ట్విట్టర్ లో, ఇతర సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. ముఖ్యంగా మంకీ పాక్స్ సోకినవారికి సమీపంగా ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలన్న దానిపై స్పష్టమైన సూచనలు చేసింది.
ట్విట్టర్ లో ఆరోగ్యశాఖ పోస్టర్..
మంకీ పాక్స్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి అంటూ కేంద్ర ఆరోగ్య శాఖ ట్విట్టర్ లో ఓ పోస్టర్ ను పోస్ట్ చేసింది. మంకీ పాక్స్ ముప్పు, అది సోకకుండా తీసుకోవాల్సిన చర్యలను అందులో పేర్కొంది. ఆ పోస్టర్ లోని వివరాల ప్రకారం..
మంకీ పాక్స్ ఎవరికి వస్తుంది?
చిన్నా పెద్దా తేడా లేకుండా ఎవరికైనా మంకీ పాక్స్ సోకే అవకాశం ఉంటుంది. మంకీ పాక్స్ సోకినవారితో ఎక్కువ సేపు సన్నిహితంగా గడిపినా, తరచూ వారిని కలుస్తూ ఉన్నా.. వైరస్ సోకే అవకాశం చాలా ఎక్కువ.
ఏం చేయాలి?
- మంకీ పాక్స్ సోకిన వారిని, వారితో సన్నిహితంగా ఉన్నవారిని ఐసోలేషన్ లో ఉంచాలి.
- నీళ్లు, సబ్బుతో చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. వీలైతే శానిటైజర్లను వినియోగించాలి.
- మంకీ పాక్స్ సోకిన వారికి సమీపంగా ఉండాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్, చేతులకు గ్లవ్స్ ధరించాలి.
- మంకీ పాక్స్ పాజిటివ్ వారు, అనుమానితులు ఉన్న, సంచరించిన ప్రదేశాలను డిసిన్ఫెక్టెంట్లతో శానిటైజ్ చేయాలి.
ఏమేం చేయకూడదు?
- మంకీ పాక్స్ సోకిన వారితో వస్త్రాలు, టవళ్లు, బెడ్ షీట్లు వంటివి పంచుకోకూడదు.
- ఇన్ఫెక్షన్ సోకినవారికి సంబంధించిన దుస్తులతో ఇతరుల వస్త్రాలను కలిపి ఉతకకూడదు.
- మంకీ పాక్స్ కు సంబంధించిన లక్షణాలు ఏవైనా కనిపిస్తే.. ఎలాంటి బహిరంగ ప్రదేశాలు, జనం గుమిగూడే ప్రదేశాలకు వెళ్లకూడదు.
- మంకీ పాక్స్ వైరస్, లక్షణాలు, సోకినవారి విషయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దు.