Azadi Ka Amrit Mahostav: త్రివర్ణపతాకం చేతబట్టిన నెహ్రూ.. కాంగ్రెస్ ప్రొఫైల్ పిక్!
- దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఈ ఏడాదికి 75 ఏళ్లు
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట కేంద్రం భారీ కార్యక్రమం
- త్రివర్ణ పతాకాన్ని ప్రొఫైల్ పిక్‌గా మార్చేస్తున్న బీజేపీ నేతలు
- అదే బాటలో సాగుతున్న కాంగ్రెస్ పార్టీ
- ఇప్పటికే రాహుల్, ప్రియాంకల ప్రొఫైల్ పిక్‌లు మారిన వైనం
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట భారీ కార్యక్రమానికి తెర తీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ నేతలందరికి సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్‌లు త్రివర్ణ పతకాంతో మారిపోయాయి. ప్రధాని నరేంద్ర మోదీ సహా ఆ పార్టీ కీలక నేతలతో పాటు కింది స్థాయి నేతల ప్రొఫైల్ పిక్‌లు ఇప్పటికే మారిపోయాయి.
ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షం హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ప్రత్యేక సందర్భానికి గుర్తింపుగా తమ సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్‌లను మార్చేస్తోంది. బీజేపీ నేతలకు కాస్తంత భిన్నంగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీ... భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకున్న చిత్రాన్ని తన ప్రొఫైల్ పిక్‌గా ఎంచుకుంది. బుధవారం ఆ పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలు తమ ఖాతాలకు నూతన ప్రొఫైల్ పిక్‌లను జత చేశారు. పార్టీలోని కీలక నేతలంతా ఇదే ప్రొఫైల్ పిక్‌లను తమ డీపీలుగా మార్చుకుంటున్నారు.