Etala Rajender: రేవంత్.. కొడంగల్ లో ఓడినప్పుడు ఏం చేశావ్..?: ఈటల
- రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దారుణమన్న ఈటల
- బీజేపీని తిట్టడం మానేసి సీఎం కేసీఆర్ తో కొట్లాడాలని రేవంత్ కు సూచన
- రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతూ ఎదిగారని ఆరోపణ
- మునుగోడులో జరిగేది కేసీఆర్ అహంకారంపై పోరాటమని వ్యాఖ్య
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం సరికాదని, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తానంటే మునుగోడు ప్రజలు సంతోషపడుతున్నారని, ఉప ఎన్నిక వస్తే తమ సమస్యలు తీరుతాయని భావిస్తున్నారని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక వ్యక్తుల మధ్య కాదని.. సీఎం కేసీఆర్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య పోరాటమని ఈటల అభివర్ణించారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ ఆడిన నాటకాలను మునుగోడులో సాగనివ్వబోమని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దారుణం
రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్టు చెప్పగానే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దారుణమని ఈటల తప్పుపట్టారు. ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజాస్వామ్యంలో చులకన అవుతారని పేర్కొన్నారు. బీజేపీని తిట్టడం మానేసి సీఎం కేసీఆర్ తో కొట్లాడాలని రేవంత్ కు సూచించారు. రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతూ ఎదిగారని ఆరోపించారు. రేవంత్ నాలుగు పార్టీలు మారలేదా? అని ప్రశ్నించారు. కొడంగల్ లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన రేవంత్.. ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.
టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటే..
తమతో కాంగ్రెస్, టీఆర్ఎస్ లకు చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని తెలిపారు. నిజానికి కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని.. అవి కలిసే పనిచేస్తున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పని చేసినట్టుగానే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ పని చేస్తాయన్నారు.