Congress: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా కారణాలను వివరిస్తూ సోనియాకు లేఖ రాసిన రాజగోపాల్ రెడ్డి
- పార్టీలో అడుగడుగునా అవమానాలు ఎదుర్కొన్నానన్న రాజగోపాల్ రెడ్డి
- కన్నీళ్లు, కష్టాలు దిగమింగుకుంటూ ముందుకు సాగానని వివరణ
- మీపైనే వ్యక్తిగత ఆరోపణలు చేసిన నేతకు పీసీసీ ఇచ్చారని విమర్శ
- జైలు పాలైన నేత కింద పనిచేయలేనని వెల్లడి
కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా దక్కిన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తనను తాను కరుడుగట్టిన కాంగ్రెస్‌వాదిగా చెప్పుకునే రాజగోపాల్ రెడ్డి... తాను ఆ పార్టీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందన్న విషయాన్ని రెండు రోజుల క్రితమే వివరించారు. తాజాగా తాను పార్టీకి రాజీనామా చేయడానికి గల కారణాలు ఇవేనంటూ ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి గురువారం ఓ లేఖ రాశారు.
కాంగ్రెస్ పార్టీని కొందరు నిర్వీర్యం చేశారని ఆరోపించిన కోమటిరెడ్డి... పార్టీకి విధేయులైన వారిని అడుగడుగునా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని అవమానాల నేపథ్యంలో కన్నీళ్లు కష్టాలు దిగమింగుకుంటూ సాగానని తెలిపారు. ఎమ్మెల్యేలను గెలిపించలేని నేతలు.. గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయారని ఆయన వివరించారు. మీపైనే వ్యక్తిగతంగా విమర్శలు చేసిన వ్యక్తికి పీసీసీ పీఠం అప్పగించారని కూడా ఆయన సోనియాకు తెలిపారు. ఇది తనను తీవ్రంగా వేధించిందని పేర్కొన్నారు. జైలు పాలైన నేత కింద పనిచేయలేనని ఆయన తేల్చి చెప్పారు. మొన్నటిదాకా మీరు ఏ పని అప్పగించినా చిత్త శుద్ధితో పనిచేశానని ఆయన తెలిపారు.
ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే రాజీనామా ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... ఈ నెల 8న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ను కలిసి స్పీకర్ ఫార్మాట్‌లో తన రాజీనామాను అందించనున్నారు. ఇప్పటికే స్పీకర్ అపాయింట్ మెంట్ కోరగా... ఈ నెల 8న రావాలంటూ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నుంచి రాజగోపాల్ రెడ్డికి సమాచారం వచ్చినట్లు సమాచారం.