YSRCP: కుప్పం నా సొంత నియోజకవర్గంతో సమానం: ఏపీ సీఎం వైఎస్ జగన్
- తాడేపల్లిలో జరిగిన తొలి భేటీ
- కుప్పం నుంచి 50 మంది నేతలను పిలిచిన అధిష్ఠానం
- మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్సీ కేఆర్‌జే భరత్‌లు హాజరు
ఏపీలో శాసనసభ నియోజకవర్గాలకు చెందిన స్థానిక నేతలతో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో భాగంగా తొలి భేటీని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ నేతలతో జగన్ ప్రారంభించారు. కుప్పం నుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ భేటీలో భాగంగా కుప్పం పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 50 మంది నేతలను పార్టీ అధిష్ఠానం తాడేపల్లికి పిలిపించింది. వారితో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కుప్పం నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీగా ఉన్న ఎమ్మెల్సీ కేఆర్‌జే భరత్‌లు కూడా ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశ్యాన్ని వివరించిన జగన్... వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించాలని సూచించారు. అనంతరం కుప్పం నేతలు చెప్పిన విషయాలను జగన్ విన్నారు.
ఈ సందర్భంగా ఆయన ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. కుప్పం తన సొంత నియోజకవర్గంతో సమానమని ఆయన అన్నారు. గడచిన మూడేళ్లలో కుప్పంకు అత్యధిక మేలు జరిగిందని కూడా ఆయన చెప్పారు. కుప్పం మునిసిపాలిటీకి సంబంధించి రూ.65 కోట్ల విలువైన పనులను మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 175కి 175 సీట్లు గెలిచే పరిస్థితి కుప్పం నుంచే మొదలు కావాలని జగన్ పిలుపునిచ్చారు.