Ravindra Jadeja: జడేజా గురించి ఎంఐ, సీఎస్కే అభిమానుల మధ్య ఆసక్తికర చర్చ
- ముంబై ఇండియన్స్ జట్టుకు చక్కగా సరిపోతాడన్న అభిప్రాయం
- అతడి కోసం ఇషాన్ కిషన్ ను చెన్నైకు విడిచి పెట్టాలని సూచన
- ట్విట్టర్ లో ఇరు జట్ల అభిమానుల అభిప్రాయాలు
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడైన రవీంద్ర జడేజా గురించి సీఎస్కే, ముంబై ఇండియన్స్ అభిమానుల మధ్య ట్విట్టర్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. 2022 ఐపీఎల్ సీజన్ కు కెప్టెన్ గా రవీంద్ర జడేజాను సీఎస్కే ఎంపిక చేసుకోవడం, వరుస ఓటములతో అతడు తప్పుకోగా, తిరిగి కెప్టెన్సీ బాధ్యతలను ధోనీ తీసుకోవడం తెలిసిందే. కెప్టెన్ మార్పుతో సీఎస్కే గత సీజన్ లో లీగ్ దశ నుంచే నిష్క్రమించాల్సి వచ్చింది. గాయం పేరుతో జట్టుకు జడేజా దూరం కావడం కూడా చూశాం.
ఈ క్రమంలో జడేజా వచ్చే సీజన్ కు కొత్త జట్టులో కనిపించొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జడేజా తన ఇన్ స్టా గ్రామ్ ప్రొఫైల్ పేజీ నుంచి 2021, 2022 సీజన్ లకు సంబంధించి పోస్ట్ లను తొలగించడం కూడా ఈ ఊహాగానాలకు బలాన్నిస్తోంది. అయితే, ఈ క్రమంలో జడేజా ముంబై జట్టుతో కలిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు ముంబై జట్టు అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది.
ముంబై జట్టులో జడేజా చక్కగా కుదురుకుంటాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అతడి కోసం ముంబై జట్టు ఇషాన్ కిషన్ ను చైన్నై జట్టుకు విడిచి పెట్టాలని సూచిస్తున్నారు. ‘‘జడేజాను కొనుగోలు చేయడం సాధ్యపడుతుందని అనుకోవడం లేదు. ఎందుకంటే సంజయ్, షోకీన్ ఉన్నారు. పైగా జడేజా పారితోషికం రూ.10 కోట్లు దాటిపోయింది. ఎంఐ అంత పెట్టలేదు. ఉన్న ఒకే అవకాశం ఇషాన్ ను చెన్నై జట్టుకు ఇచ్చి, జడేజాను తీసుకోవడమే’’ అని ఎంఐ అభిమాని ఒకరు సూచించారు.
జడేజాను తీసుకుంటే ముంబై జట్టు బ్రెవిస్, స్టబ్స్, టిమ్ డేవిడ్ తో రాజీలేకుండా ఆడించొచ్చన్నది మరో అభిమాని అభిప్రాయం. మొత్తానికి జడేజా ఏ జట్టుతో తదుపరి సీజన్ లో కనిపిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.