Commonwealth Games: కామన్వెల్త్​ లో రెజ్లింగ్ పోటీల తొలి రోజే భారత్​ కు మూడు స్వర్ణాలు

Indian Wrestlers win three gold for India in CWG 2022

  • బజ్ రంగ్, దీపక్, సాక్షి మాలిక్ కు బంగారు పతకాలు
  • అన్షు మాలక్ కు రజతం, దివ్య, మోహిత్ కు  కాంస్యాలు
  • రెజ్లింగ్ లో మరిన్ని పతకాలు లభించే అవకాశం 

కామన్వెల్త్‌‌ క్రీడల్లో భారత మల్ల యోధులు అద్భుత ప్రదర్శన చేశారు. రెజ్లింగ్ పోటీలు మొదలైన తొలి రోజే మూడు స్వర్ణాలు సహా ఆరు పతకాలు కైవసం చేసుకొని సత్తా చాటారు. బర్మింగ్ హామ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన పోటీల్లో పురుషుల 65 కిలోల విభాగంలో స్టార్‌‌ రెజ్లర్‌‌, డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ బజ్‌‌రంగ్‌‌ పునియా, 86 కిలోల విభాగంలో దీపక్‌‌ పునియాతో పాటు మహిళల 62 కిలోల కేటగిరీలో సాక్షి మాలిక్‌‌ బంగారు పతకాలు సొంతం చేసుకుంది. 57 కిలోల విభాగంలో మరో భారత రెజ్లర్ అన్షు మాలిక్‌‌ రజత పతకంతో మెరిసింది. 

కామన్వెల్త్ క్రీడల రెజ్లింగ్ లో ప్రతీసారి సత్తా చాటే రెజ్లర్లు ఈ సారి కూడా అదే జోరు కొనసాగించారు. బరిలోకి దిగిన ప్రతి బౌట్‌‌లోనూ ఉడుం పట్టుతో పతకాలు సాధించారు. పురుషుల‌ 65 కిలోల ఫైనల్లో బజ్‌‌రంగ్‌‌ 9–2తో లాల్‌‌చ్లాన్‌‌ మౌరీస్‌‌ మెక్‌‌నిల్‌‌ (కెనడా)ను చిత్తు చేశాడు. కామన్వెల్త్ క్రీడల్లో బజ్‌‌రంగ్‌‌కు ఇది వరుసగా మూడో పతకం‌ కావడం విశేషం. ఇక పురుషుల 86 కిలోల ఫైనల్లో దీపక్‌3–0తో మహ్మద్‌‌ ఇనామ్‌‌ (పాకిస్థాన్‌‌)ను ఓడించి ఈ క్రీడల్లో తొలి స్వర్ణం అందుకున్నాడు.

టోక్యో ఒలింపిక్స్‌‌లో నిరాశపర్చిన సాక్షి మాలిక్‌ కామన్వెల్త్ లో మాత్రం ‘స్వర్ణ’ పట్టు పట్టింది.‌ 62 కిలోల ఫైనల్లో సాక్షి మాలిక్‌‌ ‘విక్టరీ బై ఫాల్‌‌’తో అనా గోడినెజ్‌‌ గొంజాలెజ్‌‌ (కెనడా)పై గెలిచింది. ఇక, శుక్రవారం తన పుట్టిన రోజు జరుపుకున్న అన్షు మాలిక్ రజతం సాధించడం విశేషం. 57 కిలోల ఫైనల్లో అన్షు 3–7తో ఒడునాయో ఫోల్సాడే అడెకురో (నైజీరియా) చేతిలో ఓడి రెండో స్థానంతో వెండి పతకం గెలిచింది. 

ఇక, మహిళల 68 కిలోల విభాగంలో దివ్యా కక్రాన్‌, పురుషుల 125 కిలోల కేటగిరీలో మోహిత్ గ్రేవాల్ కాంస్య పతకాలు సాధించారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలతో పోల్చితే పోటీ తక్కువగా ఉండే కామన్వెల్త్ రెజ్లింగ్ లో భారత్ కు మరిన్ని పతకాలు లభించే అవకాశాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News