Etela Rajender: ఈ నెల 21 నాటికి 10 నుంచి 15 మంది బీజేపీలో చేరుతారు: ఈటల రాజేందర్
- బీజేపీలోకి వచ్చే ప్రతి ఒక్కరికీ స్వాగతం పలుకుతామన్న ఈటల
- ఈ నెల 21న రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారని వెల్లడి
- మాజీ ఐఏఎస్ లు, ఐపీఎస్ లు కూడా చేరబోతున్నారన్న రాజేందర్
తెలంగాణలో ఇప్పుడు అందరి చూపు బీజేపీ పైనే ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యే, చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నుంచి బీజేపీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని చెప్పారు. దాసోజు శ్రవణ్, నర్సాపూర్ మున్సిపల్ ఛైర్మన్ మురళి యాదవ్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు వంటి నేతలు బీజేపీలో చేరబోతున్నారని తెలిపారు. పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతామని చెప్పారు.
ఇక ఈ నెల 21న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారని తెలిపారు. 21 నాటికి పలువురు రిటైర్డ్ ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, బిజినెస్ మేన్లు, ఇతర పార్టీల నేతలు 10 నుంచి 15 మంది తమ పార్టీలో చేరనున్నారని చెప్పారు.
ఉస్మానియా యూనివర్శిటీ, బాసర ట్రిపుల్ ఐటీ, కాకతీయ యూనివర్శిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు మంచి ఆహారం కూడా పెట్టడం లేదని ఈటల విమర్శించారు. సీఎం కేసీఆర్ మనవడు ఏం తింటున్నాడో అదే బువ్వ అందరికీ పెడతున్నాం అని చెప్పే మాట నిజమైతే... కేసీఆర్ మనవడిని నాలుగు రోజులు హాస్టల్ కి పంపాలని అన్నారు.