TDP: చాలా కాలం తర్వాత ఒకే వేదికపై మోదీ, చంద్రబాబు... ఉత్సాహంగా టీడీపీ అధినేత
- రాష్ట్రపతి భవన్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ సమావేశం
- ప్రధాని మోదీ నేతృత్వంలో జరుగుతున్న భేటీకి హాజరైన చంద్రబాబు
- పలువురు సీఎంలు, కేంద్ర మంత్రులతో మాట కలిపిన చంద్రబాబు
- చంద్రబాబును పలకరించిన జాతీయ మీడియా సంస్థల జర్నలిస్టులు
- ఏపీలో జగన్ ప్రభుత్వంపై తిరగబడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న చంద్రబాబు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చాలా కాలం తర్వాత శనివారం ఒకే వేదికపై కనిపించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమంలో చేపట్టాల్సిన అంశాలపై జాతీయ స్థాయి కమిటీ సమావేశాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హాజరు కావాలంటూ కేంద్రం నుంచి చంద్రబాబుకు ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. కేంద్రం ఆహ్వానం మేరకు శనివారం ఉదయం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. శనివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లో ఈ కమిటీ సమావేశం కాగా... చాలా కాలం తర్వాత మోదీ, చంద్రబాబు ఒకే వేదికపై కనిపించారు.
ఈ సమావేశంలో చంద్రబాబు ఉత్సాహంగా కనిపించారు. ఈ సమావేశానికి హాజరైన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో చంద్రబాబు ముచ్చటిస్తూ కనిపించారు. సమావేశానికి కాస్తంత ముందుగా రాష్ట్రపతి భవన్కు వచ్చిన చంద్రబాబును జాతీయ మీడియా సంస్థలకు చెందిన పలువురు సీనియర్ జర్నలిస్టులు పలకరించారు.
ఈ సందర్భంగా ఏపీలోని పరిస్థితులు, జాతీయ రాజకీయ పరిణామాలపై వారితో చంద్రబాబు ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ క్రమంలో ఏపీలోని జగన్ సర్కారుపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. జగన్పై తిరుగుబాటు చేసేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఈ విషయం తెలిసి జగన్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.