Pawan Kalyan: జనసేన వీర మహిళలకు జరిగిన అవమానంపై జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం: పవన్ కల్యాణ్

Pawan Kalyan said they complains to NCW on a YCP MLA scolded Janasena women workers

  • ఇటీవల కోనసీమ వరద ప్రాంతాలలో పర్యటించిన సీఎం 
  • వినతి పత్రాలు ఇచ్చేందుకు జనసేన వీరమహిళల యత్నం
  • ఓ ఎమ్మెల్యే దూషించారని పవన్ ఆరోపణ 
  • అసభ్య పదజాలం ఉపయోగించారని వ్యాఖ్య 

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ పార్టీ వీరమహిళలతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. కోనసీమ జిల్లా గంటి పెదపూడిలో వరద బాధితుల కడగండ్లను జనసేన వీరమహిళలు సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే వైసీపీ ఎమ్మెల్యే వారిని అసభ్య పదజాలంతో దూషించారని పవన్ ఆరోపించారు. సదరు ఎమ్మెల్యేపై జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. 

వరదల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వీరమహిళలు ప్రయత్నిస్తే, వారిని అడ్డుకోవడం ప్రభుత్వ సంకుచిత ధోరణికి నిదర్శనం అని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే మహిళలపై ఇష్టానుసారం నోరుపారేసుకోవడం హేయం అని పేర్కొన్నారు.

అయితే తమ వీర మహిళలు గంటి పెదపూడిలో వరద బాధితుల సమస్యలపై అధికార పార్టీ ఎమ్మెల్యేను ధైర్యంగా నిలదీశారని తెలిపారు. జనసేన పార్టీకి వీర మహిళలు భవిష్యత్ వారధులని అభివర్ణించారు. వారి పోరాటాలను మరింత విస్తృతం చేస్తామని, అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాలు ఇవ్వడానికి జనసేన నాయకులు వస్తే ఎందుకంత భయం? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News