ISRO: నింగిలోకి చిట్టి ఉపగ్రహం.. షార్ నుంచి ఎస్ఎస్ఎల్వీ ప్రయోగం
- అన్ని దశలూ పూర్తయినట్టు ఇస్రో ప్రకటన
- టెర్మినల్ స్టేజ్ లో డేటాను కోల్పోయినట్టు వెల్లడి
- రెండు ఉపగ్రహాలను తీసుకెళ్లిన ఉపగ్రహ వాహక నౌక ఎస్ఎస్ఎల్వీ
ఏపీలోని శ్రీహరికోట ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి ఎస్ఎస్ఎల్వీ ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం పూర్తయింది. ఉదయం 9.18 గంటలకు నింగిలోకి దూసుకుపోయింది. మూడు దశలు పూర్తయినట్టు ఇస్రో ప్రకటించింది. కాకపోతే టెర్మినల్ స్టేజ్ లో డేటా నష్టం జరిగిందని, దీనికి కారణాలను పరిశీలిస్తున్నట్టు తెలిపింది.
ఈ ఉపగ్రహ వాహక నౌక ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులు రూపొందించిన చిన్న ఉపగ్రహం అజాదికాట్ ను కక్ష్యలోకి తీసుకెళ్లింది. అలాగే, మరో ఉపగ్రహం ఈవీఎస్ 02ను కూడా నింగిలోకి తీసుకునిపోయింది. విజయవంతంగా కక్ష్యలోకి ఈ రెండు ఉపగ్రహాలను ప్రవేశపెట్టినట్టు డేటా ఇంకా అందలేదు.
ఇందులో అజాదికాశాట్ ఉపగ్రహం జీవిత కాలం ఆరు నెలలు. దీని బరువు 8 కిలోలు. ట్రాన్స్ పాండర్లు, సోలార్ ప్యానెళ్ల చిత్రాలను తీస్తుంది. ఈవోఎస్ 02 శాటిలైట్ బరువు 140 కిలోలు. ఇది ఆప్టికల్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ అనుసంధానతను పెంచుతుంది. భూమి చుట్టూ తిరుగుతూ పరిశీలిస్తూ ఉంటుంది.
ఎస్ఎస్ఎల్వీ అన్నది తక్కువ ఖర్చుతో చిన్న పాటి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు తయారు చేసినది. ఇప్పటి వరకు అన్ని రకాల శాటిలైట్ల ప్రయోగానికి పీఎస్ఎల్వీని ఇస్రో ఉపయోగించేది. కానీ, దానికయ్యే ఖర్చు, సమయం ఎక్కువ. కానీ, ఎస్ఎస్ఎల్వీ విషయంలో మూడు రోజుల్లో కేవలం రూ.30 కోట్ల వ్యయంతోనే ఉపగ్రహాలను ప్రయోగించడం సాధ్యపడుతుంది.